ఇక ఏరులై పారు
ఇక నుంచి జిల్లాలో మద్యం ఏరులై పారనుంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగిస్తూ.. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలు చేసింది. ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపేసింది. ఇక తాగినోడికి తాగినంత తాపించడమే లక్ష్యంగా ప్రైవేటు వ్యాపారులకు రెండేళ్ల పాటు లైసెన్సులు జారీ చేయనుంది.
మద్యంధార..
తాగినోడికి తాగినంత..!
● ప్రైవేటు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ● జిల్లాలో 104 నూతన మద్యం దుకాణాల ఏర్పాటు ● తాగించడం..ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా పాలసీ ● దరఖాస్తుల స్వీకరణ ఆరంభం.. ఈనెల 9 వరకు గడువు ● 11న లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో 104 మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు.. దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలతో పోలిస్తే ప్రైవేటు దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరిగే సమయాన్ని గంట పెంచుతూ మందు బాబులకు ఆఫర్ కూడా ఇచ్చారు. ఫలితంగా ఉదయాన్నే తాగి కుటుంబంలో గొడవలకు దిగే అవకాశాన్ని కల్పించినట్లు అయ్యింది. ఇక మద్యం దుకాణాల దరఖాస్తు రుసుమును రూ.2 లక్షలు (నాన్–రీఫండబుల్)గా నిర్ణయించారు. అయితే లైసెన్సు ఫీజును మాత్రం భారీగా పెంచేశారు. వ్యాపారులకు వచ్చే లాభాలు 20 శాతంగా చెప్పిన ప్రభుత్వం.. పన్నులు మినహాయిస్తే 14 శాతం వరకు వస్తుందనే విషయాన్ని దాచేసింది.
జిల్లాలో రెండు శ్లాబులు
ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను ఏమాత్రం పెంచకుండా యథావిధిగా దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ లైసెన్సు ఫీజులను భారీగా పెంచేసింది. మొత్తం నాలుగు శ్లాబులు ఉన్నప్పటికీ జి ల్లాలోని జనాభా ప్రాతిపదికన రెండు శ్లాబులు మా త్రమే వర్తిస్తుంది. ఇందులో 50 వేల లోపు జనాభా ఉంటే శ్లాబ్–2, 50 వేల పైనుంచి 5 లక్షల్లోపు జనా భా ఉంటే శ్లాబ్–3గా విభజించారు. శ్లాబ్–2 ప్రకా రం 34 దుకాణాలను చూపించిన అధికారులు ఇక్కడ ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.55 లక్షలుగా నిర్ణయించారు. శ్లాబ్–3లో 70 దుకాణాలు ఏర్పాటు చేసి ఏడాది లైసెన్సు ఫీజును రూ.65 లక్షలుగా నిర్ణయించారు. ఏడాది తరువాత లైసెన్సు ఫీజులో 10 శాతం పెంచుతారు. 2017లో ఇదే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో శ్లాబ్–2కు లైసెన్సు ఫీజు రూ.10 లక్షలుండగా, శ్లాబ్–3కు రూ.12.50 లక్షలు ఉండడం గమనార్హం.
గీత కార్మికులకు తరువాత..
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టో ప్రకారం కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గీత కార్మికుల ప్రస్తావన లేదు. తొలి విడత ప్రక్రియ పూర్తయితే, ఆపై గీత కార్మికుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. వీళ్లకు లైసెన్సు ఫీజు, దరఖాస్తు ఫీజులో ఏవైనా రాయితీలు ఇస్తారా? అనేది నోటిఫికేషన్ విడుదలైతే తప్ప తెలియదు.
ఆ కుటుంబాలు రోడ్డుకు..
ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు, కాపలాదారుల గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 113 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 500 మంది వరకు పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో నూతన పాలసీ అమల్లోకి వస్తున్న వేళ.. వారంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎక్కడ ఎన్ని దుకాణాలంటే..
జిల్లాలో ఎనిమిది సర్కిళ్లు ఉంటే ఆయా స్టేషన్ల వారీగా దుకాణాలున్నాయి. ఇందులో చిత్తూరు అర్బన్‌లో 22 దుకాణాలు, చిత్తూరు రూరల్ 19, నగరి 11, కార్వేటినగరం 8, పుంగనూరు 14, పలమనేరు 13, కుప్పంలో 10, పులిచెర్లలో 7 దుకాణాలు ఏర్పాటు చేశారు.
పాలసీలోని ప్రధాన అంశాలు
దరఖాస్తు రుసుము : రూ.2 లక్షలు (తిరిగి ఇవ్వరు)
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు : ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గం.ల్లోపు
లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు : 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి..
లాటరీ తీసే ప్రదేశం : చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కల్యాణ మండపం
ప్రైవేటు మద్యం అమ్మకాలు ప్రారంభం : 12వ తేదీ నుంచి
మద్యం విక్రయ వేళలు : ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు
మద్యం లైసెన్సు గడువు : 2024–2026 (సెప్టెంబర్ 30వ తేదీ వరకు)
ఇక ప్రైవేటు మద్యం దుకాణాలు
నూతన మద్యం పాలసీలో మద్యం దుకాణాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకు అనుమతిస్తున్న ట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం చిత్తూరులోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, చిత్తూరు ఈఎస్ శ్రీనివాస్, ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి, చిత్తూరు అర్బన్ సీఐ శ్రీహరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుందన్నారు. వ్యాపారులు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, అలా చేసుకోలేనివారు ఏదైనా ఎకై ్సజ్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అందిస్తే, అధికారులు ఆన్‌లైన్ చేస్తారన్నా రు. ఈనెల 11వ తేదీన జరిగే లాటరీ రోజున దరఖాస్తుదారుడు వస్తే సరిపోతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కల్లుగీత కార్మికులకు దుకాణాల కేటాయింపుపై ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకై నా, ఎన్ని దరఖాస్తులైన వేయవచ్చని.. లాటరీ పద్ధతిలో ఒక్కో దుకాణానికి, ఒక దరఖాస్తును తీసి లైసెన్సు కేటాయిస్తామన్నారు. ఇక లైసెన్సు వచ్చిన వ్యక్తి ఈనెల 12వ తేదీ నుంచి దుకాణాలు నిర్వహించుకోవచ్చన్నారు. లైసెన్సు ఫీజును ఆరు విడతలుగా చెల్లించడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తులను https://hpfsproject.com అనే వెబ్‌సైట్ ద్వారా అందచేయొచ్చని తెలిపారు.
ఇక ఏరులై పారు


