
● చంద్రబాబు బూటకపుహామీలను ప్రజలు నమ్మరు ● డిప్యూటీ సీఎం నారాయణస్వామి
పెనుమూరు(కార్వేటినగరం): నైతిక విలువల్లేని పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలతో పాటు కాంగ్రెస్ అని, ఈ పార్టీ లు కూటమిగా కలసి వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే వెన్నుపోటుదారుడు చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని మంత్రి ఎద్దేవాచేశారు. ఆచూకీ లేని పొత్తుల పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం కంటే టీడీపీలో విలీనమవడమే మేలని మంత్రి చురకలంటించారు. అధికారంలోకి వస్తే పెన్షన్‌తో పాటు వలంటీర్ల జీతాలను పెంచుతామని చంద్రబాబు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని తెలిపారు. సొంతంగా పోటీ చేయలేని పార్టీలకు ఎందుకు పార్టీలు, పార్టీ గుర్తులు ఎందుకని విమర్శలు గుప్పించారు. పొత్తులో భాగంగా 23 సీట్లు తీసుకున్న పవన్‌కల్యాణ్ కనీసం ఆ 23 సీట్లయినా మీ అభ్యర్థులను నిలబెట్టే దమ్ము మీకుందా ? అని పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అందించిన పాలనను జీర్ణించుకోలేక అన్ని పార్టీలు తోడేళ్ల గుంపు ఒక్కటయ్యాయన్నారు. ప్రజలకు మేలు చేయని పార్టీలు కూడా చంద్రబాబుతో జత కట్టడం నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న చంద్రబాబుకు దళితులను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. టీడీపీకీ చెందిన ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆదినారాయణరెడ్డి దళితులను ఏవిధంగా కించపరచి మాట్లాడారో దళిత సోదరులంతా గమనించాలన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు గుర్తుకు వస్తారన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర విదేశీ వ్యవహారాల సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి నాయకులు ఉన్నారు.