పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి
మాట్లాడుతున్న జిల్లా జడ్జి అరుణ సారిక
హాజరైన న్యాయమూర్తులు
– న్యాయమూర్తులకు జిల్లా జడ్జి అరుణ సారిక ఆదేశం
చిత్తూరు అర్బన్: జిల్లాలోని న్యాయస్థానాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంపై న్యాయమూర్తులు దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శనివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు కొత్త చట్టాలు–ఎగ్జిక్యూషన్ పిటిషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించే బాధ్యత ప్రతీ ఒక్క న్యాయమూర్తిపై ఉందన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. కేసుల పరిష్కారం, కొత్త కేసుల నమోదు అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు వెలువరిస్తున్న తీర్పులు, కొత్త చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని, తీర్పులు ఇవ్వాలన్నారు. ఎగ్జిక్యూషన్ పిటిషన్, కొత్త చట్టాలపై రీసోర్సు పర్సన్లుగా న్యాయమూర్తులు శ్రీనివాసరావు, ఆదినారాయణ పలు విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్, ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి


