మెరుగైన అవకాశాలు కల్పిస్తుందని భరోసా
నైపుణ్యాల్లో శిక్షణపై మరింతగా దృష్టి
అప్నాడాట్‌కో నివేదిక
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్‌ఫాం అప్నా డాట్‌కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు.
58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే.
ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి డిమాండ్..
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్‌గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు.
మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.
మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్‌షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు.


