
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
ఏజీఆర్ బకాయిలు
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్‌డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
లెక్కింపు ఇలా..
టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
వివాదం ఏమిటంటే..
ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్
కంపెనీ వాదన ఇలా..
సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్‌లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్‌టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది.