8 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
డిసెంబర్‌లో 0.83 శాతంగా నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, ఆహారేతర పదార్థాల రేట్ల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. డిసెంబర్‌లో 0.83 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. క్రితం రెండు నెలల్లో నెగటివ్‌గా ఉన్న ధరల పెరుగుదల తాజాగా పాజిటివ్‌లోకి వచ్చింది. అక్టోబర్‌లో మైనస్ 1.02 శాతంగా, నవంబర్‌లో మైనస్ 0.32 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో ప్లస్‌లోకి వచ్చింది.
ఖనిజాలు, యంత్రపరికరాలు, ఆహార పదార్థాలు, టెక్స్‌టైల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడం కూడా ఇందుకు కారణమని పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార పదార్థాలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) నవంబర్‌లో 4.16 శాతంగా ఉండగా డిసెంబర్‌లో 0.43 శాతంగా నమోదైంది. కూరగాయలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణం 3.50 శాతంగా (నవంబర్‌లో 20.23 శాతం) ఉంది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.33 శాతంగా ఉండగా, గత నెల 1.82 శాతంగా నమోదైంది. టోకు ధరల పెరుగుదల ఒక మోస్తరుగా కొనసాగే అవకాశం ఉందని బార్‌క్లేస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ఆస్థా తెలిపారు.


