
సాధారణంగా ఉద్యోగం నచ్చకపోతే.. మరో ఉద్యోగంలో చేరుతారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కొంతమంది ఉద్యోగులకు తాము చేస్తున్న జాబ్ నచ్చకపోయినా.. కొత్త ఉద్యోగంలో చేరడానికి భయపడుతున్నారు. దీనిని 'జాబ్ హగ్గింగ్' అని నిపుణులు చెబుతున్నారు.
ఆర్ధిక అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకుండా పోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల్లో ఒకింత భయం మొదలైంది. ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగంలోనే సురక్షితంగా ఉంటే చాలనుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొత్త ఉద్యోగాల కోసం వెతికే సమయం కూడా పెరిగిపోయింది.
కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా లేఆప్స్ ఎక్కువయ్యాయి. లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో జాబ్ హగ్గింగ్ మొదలైంది. జాబ్ హగ్గింగ్ అంటే.. ఉద్యోగులు కంపెనీ పట్ల విధేయతతో ఉన్నట్లు కాదు. అది వాళ్ల భయానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోయినా.. పరిస్థితులను చూసి భయపడి ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేని పరిస్థితి వాళ్లదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
సంవత్సరాల తరబడి.. ఉద్యోగులు ఉద్యోగాల్లో కొనసాగడం యజమానికి మంచిదిగా అనిపించినా.. ఉద్యోగుల్లో మార్పు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. ఇది సంస్థను మాత్రమే కాదు, ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. భయంతో ఉన్నవారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండరు. ఇది పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని కంపెనీ గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.