
జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తుంటే.. దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఖరీదైన ప్లాన్ (రూ. 4999) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఖరీదైనది అయినప్పటికీ.. ఆఫర్స్ కూడా బోలెడన్ని ఉన్నాయని తెలుస్తోంది.
వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.4,999 వ్యాలిడిటీ.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏడాది పాటు.. రోజుకి 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకోవచ్చు. అయితే డేటా రోజుకు 2 జీబీ మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్ యధావిధిగా లభిస్తాయి.
ఎస్‌ఎమ్‌ఎస్‌లు, డేటా, వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా.. Vi MTV, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ప్లేఫ్లిక్, Fancode, Aaj Tak, Manoramax వంటి అనేక ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వాలు లభిస్తాయి.
వోడాఫోన్ ఐడియా రూ. 4999 ప్లాన్ అపరిమిత ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్, హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా వంటివి ఉన్నాయి. రోజుకి 2జీబీ డేటా అయినప్పటికీ హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా కింద.. ప్రతిరోజూ అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. ఇది సగం రోజు వినియోగాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా రోల్‌ఓవర్‌ను కూడా కలిగి ఉంది, అంటే ఉపయోగించని ఇంటర్నెట్ డేటాను వారంలోని చివరి రెండు రోజుల్లో తీసుకెళ్లి ఉపయోగించవచ్చు.