వొడాఫోన్‌ ఐడియాకు సర్కారు మద్దతు కీలకం

Vodafone Idea Financial Stress To Impact Various Stakeholders: ICRA - Sakshi

బ్యాలన్స్‌షీటు సమస్యలతో బ్యాంకులపై ప్రభావం 

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక 

న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న వొడాఫోన్‌ ఐడియా(వీఐ) రుణ భారం పెరిగిపోతుండడం బ్యాంకులపై ఆర్థిక భారానికి దారితీస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఈ ప్రభావం ఉద్యోగులతో పాటు, చందాదారులపైనా ఉంటుందని హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితుల్లో వీఐకి ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని తన నివేదికలో ప్రస్తావించింది. స్పెక్ట్రమ్‌ బకాయిలను వాయిదా వేయడం, లెవీలను తగ్గించడం, బకాయిలపై వడ్డీ రేట్లను తగ్గించడం.. ఇలా ఒకటికి మించిన చర్యల పరంగా మద్దతు అవసరం ఉన్నట్టు పేర్కొంది.(చదవండి: గూగుల్‌, యాపిల్‌.. అంతా గప్పాలేనా?) 

ఒకవేళ వొడాఫోన్‌ ఐడియా ఈ రంగం నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడితే అది టవర్‌ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని.. 1,80,000 టవర్ల స్థలాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేసింది. వీటిల్లో 40-50 శాతం మేర టవర్లు తదుపరి 18-24 నెలల కాలంలో తిరిగి ఏర్పడగలవని పేర్కొంది.

సాయం కావాలి..  
‘‘వొడాఫోన్‌ ఐడియా రుణదాతలకు రూ.23,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే, స్పెక్ట్రమ్, వాయిదా పడిన ఏజీఆర్‌ బకాయిల రూపేణా ప్రభుత్వానికి రూ.1,68,190 కోట్ల బకాయి ఉంది. గత 12 త్రైమాసికాల(2018-19 రెండో త్రైమాసికం నుంచి) నుంచి వీఐ పెద్ద ఎత్తున నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఏజీఆర్‌ చెల్లింపులకు అదనంగా.. 2021 జూన్‌ 30 నాటికి రుణ భారం(లీజు చెల్లింపులు సహా) రూ.2 లక్షల కోట్లు దాటిపోయాయి. వీటికితోడు ఏఆర్‌పీయూ స్థాయిపై ఒత్తిళ్ల వల్ల ఆదాయాలు, లాభాలు పెరగని పరిస్థితుల్లో కంపెనీ ఉంది’’ అని ఇక్రా గ్రూపు హెడ్‌ సవ్యసాచి ముజుందార్‌ తెలిపారు.(చదవండి: ఐఫోన్‌ 13లో సరికొత్త ఆప్షన్‌.. ఆపదలో ఆదుకునేలా!)

ప్రధానంగా స్పెక్ట్రమ్‌ బకాయిలను వాయిదా వేయడం రూపంలో మద్దతు అవసరం ఉందని ఇక్రా సీనియర్‌ హెడ్‌ అంకిత్‌జైన్‌ ఈ నివేదికలో పేర్కొన్నారు. ‘‘టెలికం కంపెనీలు చెల్లించే లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలను తగ్గించినట్టయితే ఎబిటా పెరిగేందుకు దారితీస్తుంది. ఒక్క శాతం ఈ చార్జీలు తగ్గినా వార్షికంగా పరిశ్రమకు రూ.1,600 కోట్లు ఆదా అవుతుంది’’ అని చెప్పారు. అలాగే, ఒక్కో వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూపాయి పెరిగినా పరిశ్రమకు అదనంగా రూ.450-500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఇక్రా అంచనా వేసింది.

ట్రాయ్‌ సిఫారసులు అమలు చేస్తే భారం తగ్గుతుంది 
టెలికం రంగ నియంత్రణ మండలి(ట్రాయ్‌) సూచించినట్టు ‘రైట్‌ ఆఫ్‌ వే చార్జీలను’(ఆర్‌వోడబ్ల్యూ) వచ్చే ఐదేళ్లపాటు రద్దు చేయడం వల్ల కంపెనీలకు నెట్‌వర్క్‌ రోల్‌ అవుట్‌ (నూతన సేవలు, టెక్నాలజీకి మారిపోవడం) వ్యయాలు గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుందని సెల్యులర్‌ ఆపరేట్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీవోఏఐ) పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆర్‌వోడబ్ల్యూ చార్జీలను వచ్చే ఐదేళ్ల కాలానికి(2020–23 నుంచి 2027–28వరకు) మాఫీ చేయాలంటూ ట్రాయ్‌ ఆగస్ట్‌ 31న కేంద్రానికి సిఫారసు చేసింది.(చదవండి: నక్షత్రం పుట్టిందోచ్‌.. ఫోటోలు రిలీజ్‌ చేసిన నాసా)

ఆర్‌వోడబ్ల్యూ చార్జీలన్నవి ప్రతీ మొబైల్‌ టవర్‌ అనుమతి కోసం, ప్రతీ కిలోమీటర్‌ దూరంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేసుకునేందుకు చెల్లించేవి. ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఉద్దీపనగా నిలుస్తుందని ట్రాయ్‌ పేర్కొనడం గమనార్హం. ఆర్‌వోడబ్ల్యూ అనుమతుల కోసం వెబ్‌ ఆధారిత జాతీయ పోర్టల్‌ను సైతం తీసుకురావాలని సూచించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top