సాక్షి, సిటీబ్యూరో: కొంత కాలంగా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లకంటే విల్లాలు, వ్యక్తిగత గృహాలకు ఆదరణ పెరిగింది. ఎక్స్‌ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది.
పశ్చిమంలోనూ హవా..
హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లోపశ్చిమాది ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్‌లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్


