 
													బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.
ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.
వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
