
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్‌స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.
అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.