
కొత్త హెచ్-1బి వీసాల (H-1B Visa) ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన వేళ మరో ప్రముఖ దేశం యూకే.. కీలక ప్రతిపాదనల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసే ఎంపికలను స్టార్మర్‌కు చెందిన "గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" చర్చిస్తోంది.
యూకే (UK)గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు ఖర్చు అవుతుంది. నిపుణుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే రుసుము వర్తిస్తుంది. దీంతో పాటు దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు వార్షిక హెల్త్‌కేర్ సర్ ఛార్జ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
2020లో ప్రవేశపెట్టిన ఈ వీసా విధానం.. సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మెడిసిన్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగాల్లో గుర్తింపు పొందినవారికి యూకేలో ఉండే అవకాశం కల్పిస్తుంది.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వీసా ఫీజు నిర్ణయంతో బ్రిటన్‌లో సంస్కరణల కోసం ఒత్తిడులు ఊపందుకున్నట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపినట్లుగా నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?