గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి | Trump Immigration Shake Up Threatens America Tech Future | Sakshi
Sakshi News home page

అమెరికా గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి

May 23 2026 12:42 PM | Updated on May 23 2026 12:49 PM

Trump Immigration Shake Up Threatens America Tech Future

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పు

తాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్‌ ఎకోసిస్టమ్‌లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్‌లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.

ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్‌జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.

స్టార్టప్‌లకు ముప్పు

అక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్‌సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్‌ ఫౌండర్‌, నిక్‌ డేవిడోవ్‌ గుర్తుచేశారు.

చట్టసభ సభ్యుల ఆగ్రహం

ఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.

ఇదీ చదవండి: మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

Advertisement
 
Advertisement
Advertisement