
త్వరలోనే అనిశ్చితులు సమసిపోతాయ్
దశాబ్దం పాటు భారత్‌లో 7–8 శాతం వృద్ధి
డెలాయిట్ దక్షిణాసియా సీఈవో శెట్టి
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధాలు ఎక్కువ కాలం పాటు కొసాగబోవని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న అనిశ్చితులు వచ్చే కొన్ని నెలల్లో సమసిపోతాయని అంచనా వేశారు. గతం కంటే ఇప్పుడు భారత్–అమెరికా మరింత సన్నిహితంగా మారినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వైపాక్షిక బంధం బలపడినట్టు తెలిపారు. దీనికితోడు భౌగోళికంగా వ్యూహాత్మకమైన స్థితిలో ఉండడంతో ఇతర దేశాలకు లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నట్టు చెప్పారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయమై భారత్–అమెరికా మధ్య విస్తృత సంప్రదింపులు నడుస్తున్న తరుణంలో డెలాయిట్ సీఈవో వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 50–60 శాతం టారిఫ్‌లు కొనసాగడం అసాధ్యమని, అవి దిగొస్తాయని శెట్టి పేర్కొన్నారు. భారత్–అమెరికా తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కనుక ఇవి మధ్యేమార్గానికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొన్ని అట్టడుగు వర్గాలు, ఇతర విభాగాలున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడం సవాలుగానే అభివర్ణించారు. సంక్లిష్టమైన అంశాల పరిష్కారం అంత సులభం కాదంటూ.. ఎన్నో దశల చర్చల తర్వాతే ఏకాభిప్రాయం సాధ్యపడుతుందన్నారు. అంతిమంగా కుదిరే ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగిస్తుందని.. రెండు దేశాల మార్కెట్ వాటా పెరుగుతుందన్నారు.
జీడీపీ వృద్ధి 6.7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రోమల్ శెట్టి అంచనా వేశారు. వచ్చే దశాబ్దంన్నర (15 ఏళ్లు) పాటు ఏటా 7–8 శాతం వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ సంక్షోభాలను (కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు) విజయవంతంగా అధిగమించడమే కాకుండా బలమైన వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. ఈ ఏడాది జపాన్‌ను అధిగమించి 4.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేయయం ఈ సందర్భంగా గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు వెనుక సేవల రంగం పాత్రను రోమల్‌శెట్టి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థకు సేవలే బలమంటూ.. అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ల ప్రభావం ఏమంత ఉండబోదన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పనితీరు మెరుగుపడినట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య పరంగా కొంత ప్రభావం ఉన్నా కానీ, అది తాత్కాలికమేనన్నారు. తలసరి ఆదాయం 2,800 డాలర్ల నుంచి 4,000 డాలర్లకు చేరుకుందంటూ, ఇదే కాలంలో వాస్తవ వినియోగం రెట్టింపైనట్టు చెప్పారు. తయారీ, సెమీకండక్టర్లు క్రమంగా పట్టు సాధిస్తునట్టు తెలిపారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉండొచ్చన్నారు. 2029–30 నాటికి మంచి స్థితికి చేరుకోవచ్చని అంచనా వేశారు.