
2035 నాటికి 600 బిలియన్ డాలర్లు జత
గ్లోబల్‌గా భారత్ కీలకపాత్ర
నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: పరిశ్రమలవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 500–600 బిలియన్ డాలర్ల మేర విలువ జత కాగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది.
వచ్చే దశాబ్దకాలంలో వివిధ రంగాలవ్యాప్తంగా ఏఐ వినియోగంతో గ్లోబల్ ఎకానమీకి 17–26 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల విలువ జతవుతుందని పేర్కొంది. భారీ సంఖ్యలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) నైపుణ్యాలున్న సిబ్బంది లభ్యత, పరిశోధన..అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుండటం, డిజిటల్..సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడగలవని నివేదిక తెలిపింది. గ్లోబల్ ఏఐ విలువలో భారత్ 10–15 శాతం వాటాను దక్కించుకోవచ్చని వివరించింది.
ఆవిష్కరణలను ప్రోత్సహించాలి: నిర్మల
అందరికీ మేలు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా నియంత్రణలు ఉండాలే తప్ప వాటిని అణచివేసే విధంగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీలను వినియోగించడమే కాకుండా వాటిని వివిధ రంగాలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చూడటంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.
ఏఐ అనేక మార్పులకు లోనవుతూ, చాలా వేగంగా పురోగమిస్తోందని మంత్రి చెప్పారు. టెక్నాలజీ పరుగుకు అనుగుణంగా నియంత్రణలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం పరిశ్రమలు ఏఐని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, మన జీవన విధానాన్ని కృత్రిమ మేధ గణనీయంగా మార్చేయనున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ రూపురేఖలను ఏఐ సిస్టమ్‌లు మార్చివేయగలవు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత కచి్చతత్వంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు మూడో వంతు పరిష్కారం కాగలవు.
→ టెక్నాలజీ సరీ్వసుల్లో కొత్త ఆవిష్కరణలు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి.
→ ప్రస్తుత 5.7 శాతం వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడీపీ 6.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్లుగా 8 శాతం వృద్ధి సాధిస్తే మరో 1.7 ట్రిలియన్ డాలర్లు పెరిగి 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు.
→ ఏఐతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నప్పటికీ, దీనితో ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రధానంగా క్లరికల్, రొటీన్ పనులు, నైపుణ్యాలు అంతగా అవసరంలేని ఉద్యోగాలు ఈ జాబితాలో ఉంటాయి. ఆర్థిక సేవలు, తయారీ రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2035 నాటికి ఆయా రంగాల జీడీపీ విలువలో కృత్రిమ మేథ వాటా దాదాపు 20–25 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యాల మెరుగుదలతో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో 50–55 బిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తాయని రిపోర్ట్ వివరించింది.