2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

Top 6 electric cars launched in India in 2021 - Sakshi

2020తో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం చేత ఈ ఏడాది ఈవీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. 2021లో ఎలక్ట్రిక్ లగ్జరీ కారు మార్కెట్ విభాగంలో అనేక కొత్త ఈవీలు లాంచ్ అయ్యాయి. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ తన రెండవ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. 2021లో ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు తమ వాహనలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ దిగ్గజ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల గురుంచి ఒకసారి తెలుసుకుందాం..

జాగ్వార్ ఐ-పేస్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ఈ ఏడాది తన ఎలక్ట్రిక్ కారును ఐ-పేస్ పేరుతో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు 90కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత నడుస్తుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ గల కారు 550 బీహెచ్‌పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర రూ.1.06 కోట్లు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.  

(చదవండి: టాటా మరో రికార్డ్‌ ! చెప్పారంటే చేస్తారంతే..)

టాటా టిగోర్ ఈవీ
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2020లో విడుదల చేసిన టాటా నెక్సాన్ కారు విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా టాటా టిగోర్ ఈవీను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. టిగోర్ ఈవీ 26కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇది 74 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 306 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలో 4-స్టార్ రేటింగ్ పొందింది. టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.11.99 లక్షల(ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది.

ఆడి ఇ-ట్రాన్ 50 & ఇ-ట్రాన్ 55
జర్మనీ విలాస కార్ల దిగ్గజం ఆడి సరికొత్త విద్యుత్‌ కారు ఇ-ట్రాన్‌ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెండు బాడీ స్టైల్స్‌ ఆడి ఇ-ట్రాన్‌ 50, ఇ-ట్రాన్‌ 55 వెర్షన్‌లను తీసుకొచ్చింది. ఇ-ట్రాన్‌ ఎస్‌యూవీ కొనుగోలు చేసే వినియోగదార్లకు రెండు ఛార్జర్లు- ఒక 11కి.వా. కాంపాక్ట్‌ ఛార్జర్‌, అదనంగా వాల్‌ బాక్స్‌ ఏసీ ఛార్జర్‌ ఇవ్వనుంది. వీటితో వినియోగదారులు కోరుకున్న ప్రదేశంలో ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. దశలవారీగా ఆడి ఇండియా విక్రయశాలల్లో 50 కి.వా. డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

ఆడి ఇ-ట్రాన్‌ 50 71కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఇది 308 బీహెచ్‌పీ పవర్, 540 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇ-ట్రాన్‌ 55 కారు 95కెడబ్ల్యుహెచ్ బ్యాటరీని పొందుతుంది. ఇది 402 బీహెచ్‌పీ పవర్, 664 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జ్ పై 359 కిలోమీటర్లు, 484 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఆడి ఇ-ట్రాన్ జీటీ
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి భారత మార్కెట్లోకి ఇ-ట్రాన్‌ జిటి, అర్‌ఎస్‌ ఇ-ట్రాన్‌ జిటి కూపే సెడాన్‌ను విడుదల చేసింది. ఇ-ట్రాన్‌ జిటి, ఆర్‌ఎస్‌ మోడల్‌ను పోర్షే తొలి ఎలక్ట్రిక్‌ కారు సాంకేతిక జోడింపుతో దీన్ని అభివృద్థి చేసింది. ఇక ఇ-ట్రాన్‌ జిటి కారు ధరను రూ. 1.8 కోట్లుగా నిర్ణయించింది. ఆర్‌ఎస్‌ ఇ-ట్రాన్‌ జిటి కూపే ధర రూ 2.05 కోట్లుగా పేర్కొంది. వైర్‌లెస్‌ స్మార్ట్‌ ఫోన్‌ చార్జర్‌, ఫ్రంట్‌, సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ట్రాక్షన్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్కింగ్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు దీని సొంతమని తెలిపింది. 

93కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల ఇ-ట్రాన్‌ జిటి కారు 523 బీహెచ్‌పీ పవర్, 630 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఆర్‌ఎస్‌ మోడల్‌ 637 బీహెచ్‌పీ పవర్, 830 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. వీటి కంబైన్డ్ ఎలక్ట్రిక్ రేంజ్ 388 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

బీఎండబ్ల్యూ  ఐఎక్స్‌
ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో, కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి కూడా ఈ కారును బుక్‌ చేసుకోవచ్చని, బుక్‌ చేసుకున్న వారికి 2022 ఏప్రిల్‌ నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనంగా వస్తోంది. ఇందులో రెండు విద్యుత్‌ మోటార్లు అమర్చారు. ఈ వాహణం 6.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే ప్రారంభ ఆఫర్‌ కింద స్మార్ట్‌ బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్‌ ఛార్జర్‌ను ఉచితంగానే అందిస్తున్నారు. 71కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల బీఎండబ్ల్యూ  ఐఎక్స్‌ కారు 326 బీహెచ్‌పీ పవర్, 630 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. 

పోర్షే టేకాన్
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే తొలి విద్యుత్తు కారు టేకాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.1.5 కోట్లు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించారు. టేకాన్‌, టేకాన్‌ 4ఎస్‌, టర్బో, టర్బో ఎస్‌ అనే నాలుగు మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. 4ఎస్‌, టర్బో, టర్బో ఎస్‌ మోడళ్లలో క్రాస్‌ టూరిస్మో అనే వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వీటిని వినియోగదారులకు అందించనున్నారు.

వీటి ధరలు రూ.1.50 కోట్ల నుంచి ప్రారంభమై రూ.2.30 కోట్ల వరకు ఉండనుంది. టేకాన్‌ కార్ల బ్యాటరీ సామర్థ్యం 79.2 - 93.4 కేడబ్ల్యూహెచ్‌ మధ్య ఉంది. టేకాన్‌ టర్బో ఎస్‌ స్పోర్ట్స్‌ మోడల్‌ పోర్షే కార్లలో అన్నింటికంటే శక్తిమంతమైందని సంస్థ తెలిపింది. 750 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుందని పేర్కొంది. 2.8 సెకన్లలో 0-100 కి.మీ/గం.కు వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 456-484 కి.మీ వరకు ప్రయాణిస్తుందని వెల్లడించింది.

(చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top