3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Three companies get Sebi nod for IPOs - Sakshi

జాబితాలో టెగా ఇండస్ట్రీస్‌ 

గో ఫ్యాషన్‌ ఇండియా

సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. జాబితాలో క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్, మహిళా దుస్తుల బ్రాండ్‌ గో కలర్స్‌ సంస్థ గో ఫ్యాషన్, మైనింగ్‌ ప్రొడక్టుల కంపెనీ టెగా ఇండస్ట్రీస్‌ చేరాయి. ఆగస్టులో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. డైవర్సిఫైడ్‌ సంస్థ పీకేహెచ్‌ వెంచర్స్‌ ఐపీవో ప్రయత్నాలు విరమించుకుంటూ ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది.  

వివరాలిలా..
ఐపీవో ద్వారా సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ రూ. 2,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్‌ సంస్థ సియాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఈక్విటీని విక్రయించనుంది. బేరింగ్‌ పీఈ ఏషియాకు చెందిన ఈ సంస్థ 2015లో సీఎంఎస్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఐపీవోలో భాగంగా గో ఫ్యాషన్‌ ఇండియా లిమిటెడ్‌ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. నిధులను 120 కొత్త ప్రత్యేకించిన బ్రాండ్‌ ఔట్‌లెట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. టెగా ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 1.36 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది.

క్యాపిటల్‌ స్మాల్‌ బ్యాంక్‌ కూడా....
షెడ్యూల్డ్‌ హోదా గల క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు మరో 38.40 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. పీఐ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ 3.37 లక్షల షేర్లు, ఎమికస్‌ క్యాపిటల్‌ పీఈ1 ఎల్‌ఎల్‌పీ 6.04 లక్షల షేర్లు, ఒమన్‌ ఇండియా సంయుక్త ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌2– 8.37 లక్షల షేర్లు చొప్పున ఆఫర్‌ చేయనున్నాయి. ఇతర వాటాదారులు సైతం 19.91 లక్షల షేర్లను విక్రయించనున్నారు.

నైకా ఐపీవోకు భారీ డిమాండ్‌
82 రెట్లు అధిక స్పందన
ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌ కంపెనీ నైకా వెంచర్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా దాదాపు 82 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. షేరుకి రూ. 1,085–1,125 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా దాదాపు 2.65 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసింది. అయితే 216 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. తద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమకూర్చుకుంది. బ్యూటీ, వెల్‌నెస్‌ ప్రొడక్టుల కంపెనీ నైకా ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లు(క్విబ్‌) 91.2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలు చేయగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలోనూ 12.25 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 630 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.19 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. ఐపీవోలో భాగంగా గత బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,396 కోట్లు సమీకరించిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top