4 గంటలు నిలిచిపోయిన ట్రేడింగ్
బంగారం, వెండి ట్రేడర్లు గగ్గోలు
ముంబై: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)ను సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇదే కారణంతో తాజాగా మంగళవారం ట్రేడింగ్ 4 గంటలకు పైగా నిలిచిపోయింది. పసిడి, వెండి రేట్లు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ట్రేడర్లలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. చివరికి డిజాస్టర్ రికవరీ సైట్ దన్నుతో మధ్యాహ్నం 1.25 గం.లకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎంసీఎక్స్‌లో ఉదయం 9 గం.లకు ప్రారంభం కావాల్సిన ట్రేడింగ్, సాంకేతిక సమస్య కారణంగా ముందు 9.30 గం.లకు వాయిదా పడింది.
ఆ తర్వాత 10 గం.లకు, అటుపైన 10.30 గం.లకు, 11.49, 12.35 గం.లకు వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి మధ్యాహ్నం 1.20 –1.24 గం.ల మధ్య స్పెషల్ సెషన్ నిర్వహించి, 1.25 గం.లకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభించారు. సాంకేతిక సమస్య వల్ల పసిడి, వెండి, క్రూడాయిల్‌తో పాటు కాపర్, జింక్, అల్యూమినియంలాంటి బేస్ మెటల్స్ ట్రేడింగ్‌పైనా తీవ్ర ప్రభావం పడింది.
టెక్నికల్ సమస్యల వల్ల ఎంసీఎక్స్‌లో ఈ ఏడాది జూలైలో కూడా గంట ఆలస్యంగా ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతకు ముందు గతేడాది ఫిబ్రవరిలో కొత్త ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలో సమస్యలు తలెత్తడంతో కార్యకలాపాలను ఏకంగా నాలుగు గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.
బీఎస్‌ఈలో మంగళవారం ఎంసీఎక్స్ షేరు 2% క్షీణించి రూ. 9,118 వద్ద క్లోజయ్యింది.


