
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బెంగళూరులో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు నగరంలోనే అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో ఒకటైన డీల్‌ను కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 15 ఏళ్లకుగాను రూ.2,130 కోట్లకు లీజుకు తీసుకుంది. బెంగళూరులోని సౌత్ ఐటీ కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీలోని 360 బిజినెస్ పార్కులో టవర్స్ 5ఏ, 5బీలో ఈ ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. టవర్ 5ఏలో 6.8 లక్షల చదరపు అడుగులు, టవర్ 5బీలో 7.2 లక్షల చదరపు అడుగులకు ఏకీకృత నెలవారీ అద్దె రూ.9.31 కోట్లుగా ఉంది. దీనికోసం టీసీఎస్ రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి.
ఈ ప్రాపర్టీ డెవలపర్ ల్యాబ్‌జోన్ ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రతి మూడేళ్లకోసారి 12 శాతం అద్దె పెంపుతో 15 ఏళ్ల కాలానికి లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. లీజు కాలంలో మొత్తం అద్దె సుమారు రూ.2,130 కోట్లుగా అంచనా వేశారు. ఇదిలాఉండగా, ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ తన ‘అనంత క్యాంపస్’ను బెంగళూరులో ప్రారంభించింది. మహదేవపురలో 16 లక్షల చదరపు అడుగులమేర దీన్ని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో కంపెనీ అతిపెద్ద కార్యాలయం. 2024లో మోర్గాన్ స్టాన్లీ ముంబైలో 1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో బెంగళూరులో జరిగిన టీసీఎస్ లీజు ఒప్పందం అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.
టీసీఎస్ గత కార్యాలయ లీజులు
చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్కులోని 6.3 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్ మార్చిలో రూ.2.8 కోట్లకు లీజుకు తీసుకుంది. నవులూరులో ఉన్న ఈ ప్రాపర్టీ ఏడు అంతస్తుల్లో విస్తరించి ఉంది. 2025 మార్చి 15న అద్దె ప్రారంభమైందని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అంతకుముందు ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శేరిలింగంపల్లి మండలంలోని ఐటీ శివారులో 10.18 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్ నెలకు రూ.4.3 కోట్లకు లీజుకు తీసుకుంది. రాజపుష్పలో ఉన్న ఈ కార్యాలయ స్థలం 18 అంతస్తుల్లో విస్తరించి ఉంది.
ఇదీ చదవండి: ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు