
పీఎఫ్‌ఆర్‌డీఏ లక్ష్యం
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం కిందకు 50 లక్షల మంది ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్ ఎస్ రామన్ ప్రకటించారు. వీధి వర్తకుల కోసం ఉద్దేశించిన పీఎం స్వనిధి పథకం 2020 జూన్ 1న ప్రారంభమైంది. దీని కింద ఒక్కో లబ్ధిదారుడికి తనఖా అవసరం లేకుండా రూ.50వేల రుణ సాయం అందించనున్నారు.
ఈ పథకం విజయవంతమైందంటూ.. స్వనిధి పథకం 82 శాతం మంది ఇప్పటికే మొదటి విడత రుణాన్ని పొందడమే కాకుండా, తిరిగి చెల్లించినట్టు రామన్ చెప్పారు. గత మూడేళ్లలో అటల్ పెన్షన్ యోజన పథకం కింద కోటి మంది కొత్త సభ్యులు చేరినట్టు తెలిపారు. ఇందులో 2024–25లోనే 1.17 కోట్ల మంది సభ్యులైనట్టు వెల్లడించారు. ఇందులో 55% మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి ఏపీవై కింద 50 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు ప్రకటించారు.
పీఎం స్వనిధి
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా పట్టణ వీధి వ్యాపారులకు సాయం చేయాలని భావిస్తున్నారు.
రుణ బదిలీలు ఇలా..
రూ.10,000 (మొదటి విడత)
రూ.20,000 (రెండో విడత, మొదటి విడత తిరిగి చెల్లించిన తర్వాత)
రూ.50,000 (మూడో విడత, రెండో విడత చెల్లింపు తర్వాత)
వడ్డీ రాయితీ ఉంటుంది.
డిజిటల్ ప్రోత్సాహకాలు: యూపీఐ, డిజిటల్ లావాదేవీలకు రివార్డులు ఇస్తారు.
లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేదు.
ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?