
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. వ్యాపార వృద్ధి, మార్జిన్లలో ప్రతికూలతను కంపెనీ చూసింది. ఈ క్రమంలో జీతాల పెంపు గురించి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సమీర్ సెక్సారియా తాజాగా ప్రకటన చేశారు.
తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు టీసీఎస్ ప్రాధాన్య అంశమని సీఎఫ్‌వో సమీర్ సెక్సారియా తెలిపారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సెక్సారియా, టీసీఎస్ లాభదాయకతతో కూడిన వృద్ధిపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. తోటి కంపెనీల మాదిరిగా కాకుండా టీసీఎస్ చాలా అరుదుగా వేతనాల పెంపును వాయిదా వేస్తోందన్న ఆయన గతంలో మాదిరి సకాలంలో వేతనాల పెంపు అమలు చేయడమే తన ప్రాధాన్యమని సెక్సారియా అన్నారు. అయితే ఈ పెంపును ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
సాధారణంగా వార్షిక వేతనాల పెంపు వల్ల నిర్వహణ లాభం మార్జిన్ 1.50 శాతానికి పైగా తగ్గుతుందని సెక్సారియా తెలిపారు. స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా డిమాండ్ దెబ్బతినడంతో నాన్ కోర్ ఆదాయంపై నికరంగా 6 శాతం పెరుగుదలను కంపెనీ చూపించింది. సాధారణంగా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతం ఆకాంక్షాత్మక పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా నొక్కి చెప్పారు.
డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు ముందస్తు నియామకాల్లో పెట్టుబడులు పెట్టడం మార్జిన్లను దెబ్బతీసిందని, డిమాండ్ లేకపోవడం వినియోగ స్థాయిలను తగ్గించిందని సెక్సారియా వివరించారు. జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది.