
పిల్లలూ... మీరంతా డబ్బులను భద్రంగా దాచుకునేందుకు పిగ్గీ బ్యాంక్‌ను ఉపయోగిస్తుంటారు కదూ. పెద్దలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని ఇందులో దాచుకొని, అది నిండాక పగలగొట్టి వాడుకుంటారు కదూ. వరాహం ఆకారంలో ఉండే ఈ పిగ్గీ బ్యాంక్ వాడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగానూ పెట్టుకుంటారు.
ఇలా డబ్బు దాచుకునే సాధనాలను వాడే అలవాటు క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలంలో వారు డబ్బులు దాచే పెట్టెలు, హుండీలు బయటపడ్డాయి. వాటిని వివిధ రకాల లోహాలతో తయారు చేశారు. అయితే వరాహ ఆకారంలో ఇలాంటివి తయారు చేయడం మాత్రం క్రీ,శ, 12వ శతాబ్దంలో మొదలైందని అంటారు.
వరాహ ఆకారంలో ఉన్న ఈ హుండీలు జావా ద్వీపంలో మొట్టమొదటిసారి దొరికినట్లు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో పెద్ద సంఖ్యలో వరాహ ఆకారపు పిగ్గీ బ్యాంకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆకారంలోని పిగ్గీ బ్యాంకులు 13వ శతాబ్దంలో జర్మనీలో తయారయ్యాయని అంటున్నారు. అక్కడ పందులను అదృష్టానికి చిహ్నాలుగా గౌరవించేవారని, అందుకే పంది ఆకారంలో వాటిని తయారు చేసేవారని భావిస్తున్నారు.
ఈ పిగ్గీ బ్యాంక్‌లు సిరామిక్ లేదా పింగాణీతో తయారు చేస్తారు. వివిధ సైజులు, ఆకారాలతో ఇవి లభ్యమవుతాయి. విదేశాల్లో పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా వీటిని ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. పిల్లల్లో పొదుపు ఆలోచన పెంచేందుకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పిగ్గీ బ్యాంకులను వారికి ఉచితంగా అందిస్తుంటాయి.