గ్లోబల్‌ విస్తరణలో దేశీ హోటల్స్‌  | Taj, Oberoi, other Indian hotel chains take to asset-light model for growth | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ విస్తరణలో దేశీ హోటల్స్‌ 

Jun 8 2025 4:22 AM | Updated on Jun 8 2025 4:22 AM

Taj, Oberoi, other Indian hotel chains take to asset-light model for growth

దక్షిణాఫ్రికా మార్కెట్లోకి ఐహెచ్‌సీఎల్‌ 

కొత్తగా 290 గదుల ప్రాపర్టీలపై ఒబెరాయ్‌ కసరత్తు 

ఆఫ్రికా, నేపాల్‌పై సరోవర్‌ హోటల్స్‌ కన్ను

న్యూఢిల్లీ: దేశీ హోటల్‌ చెయిన్స్‌ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు విదేశాలకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో బ్రిటన్, పశ్చిమాసియా దేశాలతో పాటు అటు ఆఫ్రికా ఖండంపైనా ఫోకస్‌ చేస్తున్నాయి.  టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) తాజాగా దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో మూడు లగ్జరీ లాడ్జిలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 

సఫారీతో పాటు విశిష్టమైన అనుభూతి కల్పించే పలు ఆఫర్లను తాము అందిస్తున్నట్లు ఐహెచ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ ఛత్వాల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని అంచనా వేస్తున్న ఐహెచ్‌సీఎల్‌ ఈ ఏడాదిలో 30 హోటల్స్‌ ప్రారంభించాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాలుగో త్రైమాసికంలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 126 గదుల తాజ్‌ ప్రాపర్టీని కూడా ఏర్పాటు చేయనుంది. 

అంతర్జాతీయంగా పది కొత్త ప్రాపర్టీలపై కసరత్తు చేస్తోంది. వచ్చే మూడు–నాలుగేళ్లలో బహ్రెయిన్‌లో రెండు, సౌదీ అరేబియాలో రెండు ప్రాపర్టీలను ప్రారంభించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం న్యూయార్క్, బ్రిటన్, మాల్దీవులతో పాటు కంపెనీకి 28 ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయంలో వీటి వాటా దాదాపు 20 శాతంగా నిల్చింది. 

ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతుండటంతో 2025 ప్రారంభం నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని హోటల్‌ కూడా మెరుగైన పనితీరు కనపరుస్తోందని ఛత్వాల్‌ తెలిపారు. అటు న్యూయార్క్‌ ప్రాపర్టీ కూడా పుంజుకుంటోందని వివరించారు. ఏడాది మొత్తం మీద ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆదాయాల్లో దేశీ వ్యాపారంతో పాటు అంతర్జాతీయ విభాగం వాటా కూడా మరింతగా పెరుగుతుందని చెప్పారు.  

ఒబెరాయ్‌ హోటల్స్‌ .. సరోవర్‌ సైతం.. 
ఇక లగ్జరీ దిగ్గజం ఒబెరాయ్‌ హోటల్స్‌ కూడా అంతర్జాతీయంగా కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. 2028లో సెంట్రల్‌ లండన్‌లోని మేఫెయిర్‌ ప్రాపర్టీ ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 21 గదులు ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా 497 గదులు ఒబెరాయ్‌ బ్రాండ్‌ కింద ఉన్నాయి. 2028 నాటికి మరో 290 గదులను జోడించుకోవాలని కంపెనీ భావిస్తోంది. 

రెండు ఫ్లోటింగ్‌ బోట్‌ హోటల్స్‌తో పాటు (చెరి ఏడు గదులు చొప్పున), 25 గదులతో నైల్‌ క్రూయిజర్‌ కూడా వీటిలో ఉంటాయి. లండన్‌లోని హోటల్‌ను ఒబెరాయ్‌ మాతృ సంస్థ ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌ నిర్వహించనుండగా, మిగతా వాటిని మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టుల ద్వారా నిర్వహించనున్నారు. దేశీయంగా 1994లో ప్రారంభమైన సరోవర్‌ హోటల్స్‌ కూడా విదేశాల్లో విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఆఫ్రికా ఖండంలో ఉగాండాలో సరోవర్‌ పోర్టికో కంపాలాను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ అజయ్‌ బకాయా తెలిపారు. ఇందులో 85 గదులు ఉంటాయి. 

అలాగే సోమాలియాలో 121 గదులతో సరోవర్‌ ప్రీమియర్‌ హెర్గేసియాను ప్రారంభించనున్నట్లు వివరించారు. మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టుల ద్వారా కంపెనీ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నేపాల్‌లో 304 గదులతో రాయల్‌ తులిప్‌ ఖాట్మండు ప్రాపర్టీని కంపెనీ ఈ ఏడాది ప్రారంభించనుంది. అలాగే 22,000 చ.అ.విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేస్తోంది. అటు చిత్వన్‌ నేషనల్‌ పార్క్‌లో రాయల్‌ తులిప్‌ చిత్వన్, లుంబినిలో గోల్డెన్‌ తులిప్‌ భైరాహవా కూడా జాబితాలో ఉన్నాయి.  

ఆగ్నేయాసియాలో రాయల్‌ ఆర్కిడ్‌ .. 
మరో దిగ్గజ సంస్థ బెంగళూరుకు చెందిన రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ అంతర్జాతీయంగా ఎదిగేందుకు మాల్దీవులతో పాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తోంది. శ్రీలంక, నేపాల్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే హోటల్స్‌ ఉన్న ప్రాంతాలతో పాటు సమీపంలోని ఇతర మార్కెట్లలోనూ ప్రవేశించే యోచన కూడా ఉన్నట్లు రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందర్‌ కే బాల్జీ తెలిపారు. మాల్దీవులు, పశి్చమాసియా, ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా  రీజెంటా బ్రాండ్‌ హోటల్స్, రిసార్టులను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement