breaking news
Indian Hotels Company
-
గ్లోబల్ విస్తరణలో దేశీ హోటల్స్
న్యూఢిల్లీ: దేశీ హోటల్ చెయిన్స్ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు విదేశాలకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో బ్రిటన్, పశ్చిమాసియా దేశాలతో పాటు అటు ఆఫ్రికా ఖండంపైనా ఫోకస్ చేస్తున్నాయి. టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) తాజాగా దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో మూడు లగ్జరీ లాడ్జిలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సఫారీతో పాటు విశిష్టమైన అనుభూతి కల్పించే పలు ఆఫర్లను తాము అందిస్తున్నట్లు ఐహెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ ఛత్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని అంచనా వేస్తున్న ఐహెచ్‌సీఎల్ ఈ ఏడాదిలో 30 హోటల్స్ ప్రారంభించాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాలుగో త్రైమాసికంలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 126 గదుల తాజ్ ప్రాపర్టీని కూడా ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయంగా పది కొత్త ప్రాపర్టీలపై కసరత్తు చేస్తోంది. వచ్చే మూడు–నాలుగేళ్లలో బహ్రెయిన్‌లో రెండు, సౌదీ అరేబియాలో రెండు ప్రాపర్టీలను ప్రారంభించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం న్యూయార్క్, బ్రిటన్, మాల్దీవులతో పాటు కంపెనీకి 28 ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయంలో వీటి వాటా దాదాపు 20 శాతంగా నిల్చింది. ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతుండటంతో 2025 ప్రారంభం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలోని హోటల్ కూడా మెరుగైన పనితీరు కనపరుస్తోందని ఛత్వాల్ తెలిపారు. అటు న్యూయార్క్ ప్రాపర్టీ కూడా పుంజుకుంటోందని వివరించారు. ఏడాది మొత్తం మీద ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆదాయాల్లో దేశీ వ్యాపారంతో పాటు అంతర్జాతీయ విభాగం వాటా కూడా మరింతగా పెరుగుతుందని చెప్పారు. ఒబెరాయ్ హోటల్స్ .. సరోవర్ సైతం.. ఇక లగ్జరీ దిగ్గజం ఒబెరాయ్ హోటల్స్ కూడా అంతర్జాతీయంగా కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. 2028లో సెంట్రల్ లండన్‌లోని మేఫెయిర్ ప్రాపర్టీ ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 21 గదులు ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా 497 గదులు ఒబెరాయ్ బ్రాండ్ కింద ఉన్నాయి. 2028 నాటికి మరో 290 గదులను జోడించుకోవాలని కంపెనీ భావిస్తోంది. రెండు ఫ్లోటింగ్ బోట్ హోటల్స్‌తో పాటు (చెరి ఏడు గదులు చొప్పున), 25 గదులతో నైల్ క్రూయిజర్ కూడా వీటిలో ఉంటాయి. లండన్‌లోని హోటల్‌ను ఒబెరాయ్ మాతృ సంస్థ ఈస్ట్ ఇండియా హోటల్స్ నిర్వహించనుండగా, మిగతా వాటిని మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా నిర్వహించనున్నారు. దేశీయంగా 1994లో ప్రారంభమైన సరోవర్ హోటల్స్ కూడా విదేశాల్లో విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఆఫ్రికా ఖండంలో ఉగాండాలో సరోవర్ పోర్టికో కంపాలాను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ అజయ్ బకాయా తెలిపారు. ఇందులో 85 గదులు ఉంటాయి. అలాగే సోమాలియాలో 121 గదులతో సరోవర్ ప్రీమియర్ హెర్గేసియాను ప్రారంభించనున్నట్లు వివరించారు. మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా కంపెనీ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నేపాల్‌లో 304 గదులతో రాయల్ తులిప్ ఖాట్మండు ప్రాపర్టీని కంపెనీ ఈ ఏడాది ప్రారంభించనుంది. అలాగే 22,000 చ.అ.విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేస్తోంది. అటు చిత్వన్ నేషనల్ పార్క్‌లో రాయల్ తులిప్ చిత్వన్, లుంబినిలో గోల్డెన్ తులిప్ భైరాహవా కూడా జాబితాలో ఉన్నాయి. ఆగ్నేయాసియాలో రాయల్ ఆర్కిడ్ .. మరో దిగ్గజ సంస్థ బెంగళూరుకు చెందిన రాయల్ ఆర్కిడ్ హోటల్స్ అంతర్జాతీయంగా ఎదిగేందుకు మాల్దీవులతో పాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తోంది. శ్రీలంక, నేపాల్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే హోటల్స్ ఉన్న ప్రాంతాలతో పాటు సమీపంలోని ఇతర మార్కెట్లలోనూ ప్రవేశించే యోచన కూడా ఉన్నట్లు రాయల్ ఆర్కిడ్ హోటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ కే బాల్జీ తెలిపారు. మాల్దీవులు, పశి్చమాసియా, ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రీజెంటా బ్రాండ్ హోటల్స్, రిసార్టులను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
వాహ్.. తాజ్..!
న్యూఢిల్లీ: టాటాలకు చెందిన ‘తాజ్’ ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ‘తాజ్’ హోటళ్లు బలంగా నిలబడినట్టు నివేదిక అభిప్రాయపడింది. టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) కింద తాజ్ హోటళ్లు నడుస్తుండడం గమనార్హం. 2016లో తాజ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తొలిసారి ఈ జాబితాలోకి ప్రవేశించడమే కాకుండా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘ఈ అంశాల ఆధారంగా చూస్తే తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లతో (రూ.2,200 కోట్లు) ప్రపంచంలో బలమైన హోటళ్ల బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్‌లో 100కు గాను 89.3 స్కోర్‌ను సంపాదించుకుంది. ఇది ఏఏఏ బ్రాండ్ రేటింగ్‌కు సమానం’’ అని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. తాజ్ తర్వాత ప్రీమియన్ ఇన్ రెండో స్థానంలో, మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ మూడో స్థానంలో, ఎన్‌హెచ్ హోటల్ గ్రూప్, షాంగ్రి లా హోటల్స్ తర్వాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. -
మెప్పించిన ఇండియన్ హోటల్స్
ముంబై: టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చి త్రైమాసికంలో ఏకంగా 70 శాతం పెరిగింది. ఈ కాలంలో కంపెనీ లాభం రూ.79 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.46 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 1,069 కోట్ల నుంచి రూ.1,154 కోట్లకు చేరుకుంది. డిమాండ్ బాగుండడంతో అనుకూలమైన చర్యల ద్వారా మార్జిన్లను పెంచుకోవడం మెరుగైన పనితీరుకు కారణమని కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ తెలిపారు. చెన్నై, గురుగ్రామ్ మార్కెట్లో అధిక లభ్యత ఉండడమే కారణంగా పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం 2017–18లో కంపెనీ రూ.103 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఇక ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,075 కోట్లుగా ఉండగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,165 కోట్లకు వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 హోటళ్లు ప్రారంభించామని, దీంతో మొత్తం హోటళ్ల సంఖ్య 697కు చేరుకుందని చత్వాల్ తెలిపారు. ఒక్కో షేరుకు 40 పైసల డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
టాటా గ్రూపులో మరో రాజీనామా
ముంబై: ఇండియన్ హోటల్స్ (తాజ్) ఎండీ, సీఈవో రాకేష్ సర్నా తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చెలరేగిన సుమారు రెండు సంవత్సరాల తర్వాత, మిస్త్రీ ఉద్వాసాన అనంతరం హోటల్ తాజ్ కు రాకేష్ సర్నా గుడ్ బై చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా ఐహెచ్‌సీఎల్ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థల డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని ఇండియన్ హోటల్స్ బిఎస్ఇకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. సర్నా తన మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేసినట్లు టాటా సన్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీల ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సర్నా నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందనీ, సెప్టెంబర్ 30 దాకా కొనసాగాలని కోరినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్టు చంద్రశేఖరన్ తెలిపారు. కాగా 2015లో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్ గా ఉద్వాసనకు గురైన టాటా మిస్త్రీ నియమించిన టాటా కుటుంబానికి చెందని వ్యక్తులలో ఈయన ప్రముఖులు. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఈయన కూడా వైదొలగుతారని అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. టాటా గ్రూప్ సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ గత ఏడాది అక్టోబర్ 24 న తొలగించింది. ఈ తొలగింపునకు దారి తీసిన కారణాల్లో ఇండియన్ హోటల్స్ కంపెనీ సీఈవో రాకేష్ సర్నా వచ్చిన ఈ లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటై ఉండవచ్చునన్న వార్త గుప్పుమన్న సంగతి తెలిసిందే.