
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు లాభపడి 25,134కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 ప్లాయింట్లు పెరిగి 82,467 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.63 శాతం పుంజుకుంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.
ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఐదో నెలలోనూ చోటు చేసుకుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో చేసే పెట్టుబడులు బలంగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.26,688 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు మే నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)