వార్‌కు బ్రేక్‌.. బుల్‌కు జోష్‌! | Stock Market: Sensex rises 1372 points and Nifty closes above 22912 | Sakshi
Sakshi News home page

వార్‌కు బ్రేక్‌.. బుల్‌కు జోష్‌!

Mar 25 2026 4:38 AM | Updated on Mar 25 2026 4:38 AM

Stock Market: Sensex rises 1372 points and Nifty closes above 22912

యుద్ధానికి ట్రంప్‌ 5 రోజుల విరామం 

దిగొచ్చిన క్రూడాయిల్‌ ధరలు  

మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ; 2 శాతం పెరిగిన సూచీలు 

రూ.7.56 లక్షల కోట్ల సంపద సృష్టి  

ముంబై: ఇరాన్‌ ఇంధన వనరులు, విద్యుత్‌ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనతో దలాల్‌ స్ట్రీట్‌లో రిలీఫ్‌ ర్యాలీ నెలకొంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్‌ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది.  

అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్‌ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. 

సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో పవర్‌గ్రిడ్‌ (–0.81%), సన్‌ఫార్మా (–0.20%), ఎస్‌బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్‌ 3.46%, ఇండ్రస్టియల్స్‌ 3%, ప్రైవేటు బ్యాంక్స్‌ 2.63%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 2.46%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్‌ 2.19 శాతం పెరిగాయి. 

‘ఇరాన్‌ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్‌ మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్‌ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్‌ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్‌ కవరింగ్, వేల్యూ బయింగ్‌ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్‌ లాంగ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు హరిప్రసాద్‌ తెలిపారు.

ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకి
యుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్‌ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్‌ 1.41%, థాయిలాండ్‌ 1%, సింగపూర్‌ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్‌ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్‌ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్‌ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్‌ ప్రధాన సూచీల్లో నాస్‌డాక్‌ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్‌ 0.25%, ఎస్‌అండ్‌పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.

సరికొత్త కనిష్టానికి రూపాయి... 
23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, క్రూడాయిల్‌ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది.  

జీఎస్‌పీ క్రాప్‌ సైన్స్‌ లిస్టింగ్‌ సక్సెస్‌ 
ఆగ్రోకెమికల్‌ కంపెనీ జీఎస్‌పీ క్రాప్‌ సైన్స్‌ లిస్టింగ్‌ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్‌ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement