
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 81,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు 24,892 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీతో పాటు ఫార్మా, టెక్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.22%, 0.20 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, రియల్టి, ఇంధన, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఆటో, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా స్టాక్ సూచీలు 0.50%–2% నష్టపోయాయి. జపాన్ నికాయ్ తొలిసారి 44,000 స్థాయిని అధిగమించి 44,186 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. తదుపరి లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.42% నష్టపోయి 43,459 వద్ద స్థిరపడింది. హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్ స్టాక్ సూచీలు 1.50% వరకు పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ ఇండెక్స్ 0.50% నష్టపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.25% పెరిగాయి. అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 5% పెరిగి రూ.1,505 వద్ద స్థిరపడింది. డైరెక్టర్ల బోర్డు ఈ నెల 11న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తుందని తెలపడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 5.18% లాభపడి రూ.1,507 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.