ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులు
ఐటీ, కన్జూమర్ షేర్లలో లాభాల స్వీకరణ
ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు
సెన్సెక్స్ నష్టం 151 పాయింట్లు
25,950 స్థాయి దిగువకు నిఫ్టీ
ముంబై: ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి.
ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 560 పాయింట్లు కోల్పోయి 84,219 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు పతనమై 25,810 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. ఆసియాలో కొరియా, జపాన్, చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు ఒక శాతానికి వరకు పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల ఇండెక్సుల్లో రియల్టీ 1%, యుటిలిటీ 0.82%, ఐటీ 0.72%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.60% నష్టపోయాయి. మరోవైపు మెటల్ 1.30%, కమోడిటిస్ 0.55%, ఇండ్రస్టియల్స్ 0.21%, బ్యాంకెక్స్ 0.06% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.12%, 0.06 శాతం పెరిగాయి.
⇒ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్న చైనా ప్రకటనతో అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆశలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. జిందాల్ స్టీల్ 4%, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3%, సెయిల్, వెల్‌స్పన్ కార్ప్ 2% రాణించాయి.
హిందాల్కో, ఏపీఎల్‌అపోలో, ఎన్‌ఎండీసీ షేర్లు 1–0.50% పెరిగాయి.
⇒ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 20% నుంచి 49% వరకు పెంచాలని కేంద్రం యోచిస్తుందనే వార్తల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండియన్ బ్యాంక్ 3.50%, మహారాష్ట్ర బ్యాంకు 2%, యూనియన్ బ్యాంకు, పీఎస్‌బీ 1.50%, సెంట్రల్ బ్యాంక్, పీఎన్‌బీ, యూకో బ్యాంకు, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు 1% లాభపడ్డాయి.


