
ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ
నిఫ్టీ నష్టం 346 పాయింట్లు
ముంబై: ఐటీ, ఆటో, ప్రైవేటు బ్యాంకులు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో మంగళవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,282 పాయింట్లు క్షీణించి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 24,578 వద్ద నిలిచింది. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి చైనా మార్కెట్‌కు తరలిపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో ట్రేడ్ వార్ ఆందోళనలు తెరపైకి వచ్చాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(–2%), ఇన్ఫోసిస్(–3.50%), రిలయన్స్ (–1.50%), టీసీఎస్(–3%), భారతీ ఎయిర్‌టెల్(3%), ఐసీఐసీఐ బ్యాంకు (–1%) నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ పతనంలో ఈ షేర్ల వాటాయే 845 పాయింట్లు కావడం గమనార్హం.
⇒ రంగాల వారీగా సూచీల్లో ఐటీ 2.50%, టెక్ 2.40%, యుటిలిటీ 1.35%, విద్యుత్, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. స్మాల్‌క్యాప్ సూచీ 1%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17శాతం పెరిగాయి. మరోవైపు ఫార్మా, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
లభించింది.
⇒ రక్షణ రంగ షేర్లకు మూడోరోజూ డిమాండ్ నెలకొంది. భారత్ డైనమిక్స్ 11%, యాక్సిస్‌కేడ్స్ 5%, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎల్రక్టానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50% రాణించాయి. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డీసీఎక్స్ సిస్ట మ్స్ 3% లాభపడ్డాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 9%, ఏరియల్ ఇన్నోవేషన్స్ 5% పెరిగాయి.
⇒ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎండీ పదవికి అన్మోల్ సింగ్, హోల్‌టైమ్ డైరెక్టరు పదవికి పునీత్ సింగ్ జగ్గీ రాజీనామాతో జెన్సోల్ ఇంజనీరింగ్ షేరు 5% క్షీణించి రూ.52 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. తదుపరి అనూహ్య రికవరీతో 5% లాభపడి 57.28 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి, అక్కడే ముగిసింది.