
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉండి, వేగంగా పుంజుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.
ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 677.55 పాయింట్లు (0.84 శాతం) పెరిగి 81,796.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 అయితే ఏకంగా 227.9 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగిసి 24,946.50 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.93 శాతం, 0.95 శాతం లాభాలతో ముగిశాయి.
రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలు వరుసగా 1.57 శాతం, 1.32 శాతం, 1.11 శాతం, 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ షేర్లలో అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2.4 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ మాత్రమే నష్టపోయాయి. టాప్ లూజర్ గా నిలిచిన టాటా మోటార్స్ 3.76 శాతం నష్టపోయింది.
మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 1.6 శాతం క్షీణించి 14.83 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక క్రూడాయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.6 శాతం తగ్గుదలతో 72.56 డాలర్లకు క్షీణించింది.