
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ (ఎస్‌జీఎల్‌టీఎల్) సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై వచ్చే 2–3 ఏళ్లలో రూ. 130 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం 60 టన్నుల క్రేన్, 60 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ సామర్థ్యం ఉండగా .. 100 టన్నుల క్రేన్, 100 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ స్థాయికి పెంచుకోనున్నట్లు సంస్థ తెలిపింది.
అలాగే ప్రస్తుతమున్న 5 వెల్డింగ్ రోబోల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా అంతర్జాతీయంగా హెవీ ఇంజినీరింగ్ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 16 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 171 కోట్లుగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరంలో అన్ని కీలకాంశాల్లోనూ రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. జీఎల్ హక్కా జపాన్, ఐపీపీ యూఎస్‌ఏతో భాగస్వామ్యాలు, పటిష్టమైన ఆర్డర్ బుక్, కొత్త ప్రొడక్ట్ లైన్స్‌తో ఈసారి మరింత మెరుగ్గా రాణించగలమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1% క్షీణించి రూ. 169 వద్ద క్లోజయ్యింది.