ఒక్క మిస్డ్ కాల్‌ జీవితాన్ని మార్చేసింది! | Solving Missed Calls Building Billion USD Unicorn AI Home Services | Sakshi
Sakshi News home page

ఒక్క మిస్డ్ కాల్‌ జీవితాన్ని మార్చేసింది!

May 2 2026 7:34 AM | Updated on May 2 2026 10:23 AM

Solving Missed Calls Building Billion USD Unicorn AI Home Services

సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ‘జనరేటివ్ ఏఐ’ హవా నడుస్తోంది. అద్భుతమైన చాట్‌బాట్‌లు, ఆకట్టుకునే చిత్రాలను సృష్టించే ఏఐ టెక్నాలజీపై కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్నాయి. కానీ, ఈ హడావుడికి భిన్నంగా సాధారణ మిస్డ్ కాల్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక భారతీయ సంతతి ఇంజినీర్ చరిత్ర సృష్టించారు. ఆయనే అపూర్వ శ్రీవాస్తవ. ఆయన టైసన్ చెన్‌తో కలిసి ప్రారంభించిన ‘అవోకా’ స్టార్టప్ ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ డాలర్ల (యూనికార్న్-సుమారు రూ.9300 కోట్లు) విలువను చేరుకుని ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.

అక్కడే మొదలైంది

మిచిగాన్‌లో పెరిగిన అపూర్వ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచే వ్యాపారాల్లోని కష్టనష్టాలపై అవగాహన ఉంది. మొదటి తరం భారతీయ-అమెరికన్‌గా తన కుటుంబం నడుపుతున్న చిన్న వ్యాపారం కోసం వచ్చే ఫోన్ కాల్స్‌ను ఆయన స్వయంగా నిర్వహించేవారు. ఆ సమయంలో ఆయన ఒక చేదు నిజాన్ని గ్రహించారు. సాధారణంగా మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తకపోతే ‘సరే, తర్వాత చేస్తాలే’ అనుకుంటాం. కానీ, ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ లాంటి వారి విషయంలో పరిస్థితి వేరు. ఏసీ ఆగిపోయినా లేదా ఇంట్లో పైపు లీకై నీళ్లు వస్తున్నా ఆ కస్టమర్‌కు అది అత్యవసర పరిస్థితి. ఆ సమయంలో ఫోన్ ఎత్తకపోతే కస్టమర్ వెంటనే వేరే వారికి ఫోన్ చేస్తారు. వ్యాపారస్థులకు ఒక్క ఫోన్ కాల్ మిస్ అవ్వడం అంటే ఒక కస్టమర్ చేజారడమే కాదు.. ఆ కస్టమర్ ద్వారా వచ్చే వేల రూపాయల పని (ఉదాహరణకు కొత్త ఏసీ ఇన్‌స్టాలేషన్ లేదా పెద్ద రిపేర్ వర్క్) మరొకరికి వెళ్లిపోయినట్లు లెక్క.

ఐడియా పుట్టిందిక్కడే..

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ మొదట రెస్టారెంట్ల కోసం ఏఐ ఆధారిత ఆన్సరింగ్ సేవలను రూపొందించడంపై ప్రయోగాలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఒక రెస్టారెంట్‌లో ఫోన్ కాల్ మిస్ అయితే 40 డాలర్ల నష్టం జరగవచ్చు, కానీ ఒక హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) అత్యవసర పరిస్థితిలో కాల్ మిస్ అయితే అది 40 వేల డాలర్ల భారీ కాంట్రాక్టును పోగొట్టుకోవడంతో సమానం. ఈ కోణాన్ని గుర్తించిన శ్రీవాస్తవ టైసన్ చెన్‌తో కలిసి ‘అవోకా’కు శ్రీకారం చుట్టారు.

అవోకా ప్రత్యేకత ఏమిటి?

చాలా ఏఐ సంస్థలు డెస్క్ వర్క్ ఆటోమేషన్ మీద దృష్టి పెడితే అవోకా మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే సాంకేతిక నిపుణుల కష్టాలను తీరుస్తోంది. అవోకాలోని ఏఐ ఏజెంట్లు మనుషుల లాగే స్పష్టంగా మాట్లాడగలవు. ఏ సమయంలో కాల్ వచ్చినా సెకన్ల వ్యవధిలో సమాధానం ఇస్తాయి. ఇవి కేవలం సందేశాలను తీసుకోవడమే కాకుండా కంపెనీ క్యాలెండర్లను తనిఖీ చేసి నేరుగా అపాయింట్‌మెంట్లను బుక్ చేస్తాయి. పాత ఆర్డర్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తాయి.

అవోకా పనితీరు పట్ల మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 800కు పైగా ప్రముఖ కంపెనీలు వీరి సేవలను వాడుకుంటున్నాయి. 2025లో ఈ సంస్థ వార్షిక ఆదాయం ఎనిమిది అంకెల స్థాయిని దాటేసింది. ఈ పురోగతికి గుర్తింపుగా మెరిటెక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, క్లీనర్ పెర్కిన్స్ వంటి సంస్థల నేతృత్వంలో జరిగిన తాజా ఫండింగ్ రౌండ్‌లో కంపెనీ 125 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.9300 కోట్లు)కు చేరింది. జనరల్‌ పర్పస్‌ ఏఐ కోసం ప్రపంచం పోటీ పడుతుంటే శ్రీవాస్తవ, చెన్ మాత్రం హోం సర్వీసుల ఆర్థిక వ్యవస్థలోని ఫోన్ కాల్‌లను నమ్ముకుని యూనికార్న్ స్థాయికి చేరుకోవడం విశేషం.

ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement