
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,05,880లకు చేరింది. వెండి రేటు రూ. 1,36,000 (కేజీ) వద్ద ఉంది. కాగా సిల్వర్ రేటు మరో మూడేళ్ళలో ఏకంగా రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్, వైద్య పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. ఆలయాల్లో కూడా వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పెట్టుబడిదారులు వెండివైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు వెండి ధరల్లో పెనుమార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది.
కేజీ వెండి రూ.2 లక్షల వద్దకు చేరుకోవడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఈ ఏడాది వెండి ధరలు ఇప్పటికే 30 శాతం పెరిగి.. జీవితకాల గరిష్టాలను చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ మార్కెట్ ధోరణులు, పారిశ్రామిక వినియోగం, సాంస్కృతిక కొనుగోలు వంటివన్నీ ధరలు పెరుగుదలకు కారణమవుతాయని సీఏ నితిన్ కౌశిక్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వెండి రేటు రాబోయే 12-24 నెలల్లో 15–20% పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ర్యాలీ కొనసాగితే.. కేజీ వెండి రూ. 2 లక్షలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా వెండిపై పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు మొదలైనవాటిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.