
కొన్ని రకాల ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్‌టీని తగ్గించడం, ప్రాణాధార ఔషధాలపై లెవీని మినహాయించడం.. రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని ఫార్మా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు పేర్కొన్నాయి. ఔషధాల ధరలు దిగొస్తాయని, నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డాయి.
ప్రాణాలను కాపాడే క్యాన్సర్ ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించడం బాధిత కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తుందని భారత ఫార్మాస్యూటికల్స్ కూటమి సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. చాలా ఔషధాలపై 12 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడం వల్ల చికిత్సల ధరలు తగ్గుతాయన్నారు. 33 నిత్యావసర ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించడం, కేన్సర్, అరుధైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధుల ఔషధాలపై రేటును 5 శాతానికి తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయాలే కాకుండా, దయతో తీసుకున్నవిగా భారత ఫార్మాస్యూటికల్ తయారీదారుల సమాఖ్య (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ అనిల్ మతాయ్ పేర్కొన్నారు. రోగులు, వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. తాజా చర్యలు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తాయని నాట్‌హెల్త్ ప్రెసిడెంట్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ చైర్‌పర్సన్ అయిన అమీరా షా తెలిపారు.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై సున్నా జీఎస్‌టీ అన్నది మాస్టర్ స్ట్రోక్. రక్షణ (బీమా)ను విశేషాధికారం కాకుండా, ఒక హక్కుగా మారుస్తుంది. ఔషధాలపై జీఎస్‌టీ తగ్గింపుతో ప్రతి ఇంటికీ అందుబాటు ధరలకే ఆరోగ్య సంరక్షణను చేరువ చేస్తుంది. ప్రభుత్వం లక్షలాది మంది గౌరవప్రదంగా ఆరోగ్య సంరక్షణను పొందేలా చేసింది. – శోభన కామినేని, అపోలో హెల్త్ ఈడీ (వీరు రామ్‌చరణ్ భార్య ఉపాసన మదర్)
ఇదీ చదవండి: లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు