అయిదో రోజూ ఆగని అమ్మకాలు | Sakshi
Sakshi News home page

అయిదో రోజూ ఆగని అమ్మకాలు

Published Fri, Jan 29 2021 5:39 AM

Sensex ends 535 points lower Nifty just above 13,800 - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్లో అయిదో రోజూ అమ్మకాలు ఆగలేదు. ఫలితంగా సెన్సెక్స్‌ 47వేల స్థాయిని, నిఫ్టీ 14వేల మార్కును కోల్పోయాయి. జనవరి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో బుల్స్‌ ఏ దశలో కోలుకోలేకపోయాయి. బడ్జెట్‌ ప్రకటనకు ముందు 2020–21 ఆర్థిక సంవత్సరపు సామాజిక ఆర్థిక సర్వే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 13 పైసల పతనం ప్రతికూలాంశాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.

ఫలితంగా సెన్సెక్స్‌ 536 పాయింట్ల నష్టంతో 46,874 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 150 పాయింట్లను కోల్పోయి 13,817 వద్ద నిలిచింది. ఒక్క ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 892 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు క్షీణించాయి. మార్కెట్‌ ఐదురోజుల పతనంతో సెన్సెక్స్‌ 2,918 పాయింట్లు, నిఫ్టీ 827 పాయింట్లను కోల్పోయాయి. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు జనవరి 1 తర్వాత దాదాపు 28 రోజుల తర్వాత తొలిసారి రూ.1737 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు రూ.3713 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

ఎదురీదిన ప్రైవేట్‌ బ్యాంకు షేర్లు...
మార్కెట్‌ భారీ నష్టాల్లో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఎదురీదాయి. డిసెంబర్‌ క్వార్టర్లో మొండిబకాయిలు తగ్గినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో షేరు 6 శాతం లాభపడింది. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో పలు బ్రేకరేజ్‌ కంపెనీలు బై రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్‌ ధరను పెంచడంతో ఫెడరల్‌ బ్యాంకు షేరు 3 శాతం ర్యాలీ చేసింది. ఇదే రంగానికి చెందిన బంధన్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, సిటీయూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 2.50 శాతం నుంచి అరశాతం వరకు ఎగిశాయి.   

నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు ...
రెండురోజుల పాటు సమీక్ష సమావేశాలను నిర్వహించిన యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ కమిటీ వడ్డీరేట్లపై యథాతథ విధానానికే ఓటు వేసినప్పటికీ.., ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్‌ బుధవారం 3 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఆసియా మార్కెట్లు 2%, యూరప్‌ 1% నష్టంతో ముగిశాయి.

బోర్డ్‌ మీటింగ్స్‌
ఐఓసీ, సెయిల్, వేదాంత, టాటా మోటార్స్, సన్‌ ఫార్మా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్, టెక్‌ మహీంద్రా, జస్ట్‌ డయల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, మణిప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement