
సాక్షి, సిటీబ్యూరో: భారతీయులకు సంపద అనేది కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాదు.. అదో భావోద్వేగాలతో ముడిపడిన అంశం కూడా.. అందుకే సంపాదించడమే కాదు సంపదను భద్రపరుచుకునేందుకూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. బ్యాంక్‌లు, ప్రైవేట్ సంస్థలు సేఫ్టీ లాకర్ల సేవలు అందిస్తున్నా.. వాటి పనిదినాల్లో తప్ప 24/7 వాటిని వినియోగించుకోలేం. అలా కాకుండా క్లబ్‌హౌస్‌లో, నివాస సముదాయంలోనే సాయుధ దళాల వంటి భద్రత ఉంటే ఎంత బాగుంటుందో కదూ. ఈమేరకు దేశంలోనే తొలి సేఫ్టీ డిపాజిట్ లాకర్ సేవల సంస్థ ఆరంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సత్త్వా గ్రూప్ చేతులు కలిపింది.
ఎంత విలాసవంతమైన నివాస సముదాయంలో ఉన్నా సరే బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలకు భద్రత విషయంలో కాస్త భయాందోళనలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా నివాస సముదాయాలలో జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా వంటివి ఉంటాయి. కానీ, నివాసితుల సంపదకు భద్రత, సౌకర్యవంతం కలిగించడం వసతుల్లో భాగమే. కస్టమర్ల సంపదకు గోప్యత, సౌలభ్యం, ఆనందం, భద్రత అందించడమే వీటి ప్రత్యేకతలు.
భద్రత, బీమా..
బీఐఎస్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మిలిటరీ గ్రేడ్ వాల్ట్‌తో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ప్రతీ లాకర్‌కు బయోమెట్రిక్ ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా చొరబడితే గుర్తించే నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రతి లాకర్‌కు రూ.కోటి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే లాకర్ లోపల ఏముందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. దీంతో మీ సంపద ఎల్లవేళలా మీ నియంత్రణలోనే ఉంటుంది.
కస్టమర్ల బంగారం, వజ్రాలు వంటి ఆభరణాలను సేఫ్టీ లాకర్‌లో భద్రపరిచే ముందు, తర్వాత వినియోగించిన ప్రతీసారి మీ కళ్లముందే తూకం వేస్తారు. ఏళ్ల పాటు బ్యాంక్ లాకర్ల వెయిటింగ్ జాబితాలు ఉండటం, అధిక విలువ డిపాజిట్‌లు, యాక్సెస్ పరిమితంగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి.
అయితే వీటిల్లో మాత్రం కమ్యూనిటీలోని క్లబ్‌హౌస్‌లోనే ఈ సేఫ్టీ లాకర్ ఉంటుంది. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నివాసితులకు 24/7 అందుబాటులో ఉంటుంది. అందులోనే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది. దీంతో ఆభరణాల వంటివి అలంకరించుకొని బయటకు రావొచ్చు.