
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌నకు, దాని చైర్మన్ గౌతమ్ అదానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.
హిండెన్ బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఒక నివేదికను వెల్లడించింది. అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను వాడుకుని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లకు నిధులు సమకూర్చడానికి వివిధ అదానీ గ్రూప్ కంపెనీల నుండి నిధులను మళ్లించారని ఆరోపించింది.
అయితే అదానీ గ్రూపుపై ఈ అభియోగాలను సెబీ కొట్టేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన గౌతమ్ అదానీ.. పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్నారు. తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించారు.