సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్
జాబితాలో మిల్కీ మిస్త్ డైరీ ఫుడ్
క్యూర్‌ఫుడ్స్ ఇండియా, గాజా క్యాపిటల్
స్టీమ్‌హౌస్ ఇండియా, కనోడియా సిమెంట్
న్యూఢిల్లీ: 2025లో ఇప్పటివరకూ 84 కంపెనీలు మెయిన్‌బోర్డులో ఐపీవో చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్, హెల్మెట్ల తయారీ స్టడ్స్ పబ్లిక్ ఇష్యూలకు ఈ వారం తెరలేవనుంది. కాగా.. తాజాగా మరో 5 కంపెనీలు సెబీ నుంచి అక్టోబర్ 14–24 మధ్య గ్రీన్ సిగ్నల్ పొందాయి. ఈ కంపెనీలన్నీ 2025 మే నుంచి జూలై మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
తమిళనాడు కంపెనీ
డైరీ ప్రొడక్టుల తమిళనాడు కంపెనీ మిల్కీ మిస్త్ డైరీ ఫుడ్ ఐపీవో ద్వారా రూ. 2,035 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,785 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణసహా పెరుందురై ప్లాంటు ఆధునీకరణకు వినియోగించనుంది. యోగుర్త్, క్రీమ్ చీజ్ తయారీతోపాటు.. ఐస్‌క్రీమ్ ఫ్రీజర్లు, చాకొలెట్ కూలర్లు, విజీ కూలర్ల ఏర్పాటుపై మరికొన్ని నిధులు వెచి్చంచనుంది.
క్లౌడ్ కిచెన్స్‌తో..
క్లౌడ్ కిచెన్స్ నిర్వాహక బెంగళూరు కంపెనీ క్యూర్‌ఫుడ్స్ ఇండియా ఐపీవో ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.85 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ కేక్‌జోన్, నోమడ్ పిజ్జా బ్రాండ్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇష్యూ నిధులను క్రిస్పీ క్రీమ్ క్లౌడ్ కిచెన్లతోపాటు రెస్టారెంట్లు, సెంట్రల్ కిచెన్ల ఏర్పాటు, విస్తరణకు వినియోగించనుంది. అనుబంధ సంస్థలు హాస్పిటాలిటీ సరీ్వసెస్, కేక్‌జోన్ ఫుడ్‌టెక్స్‌లో పెట్టుబడులు, రుణ చెల్లింపులకు సైతం నిధులను వెచ్చించనుంది.
ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్
గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందిన స్టీమ్‌హౌస్ ఇండియా ప్రధానంగా ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆల్టర్నేటివ్ పెట్టుబడులు
గాజా క్యాపిటల్ బ్రాండుతో ఆల్టర్నేటివ్ పెట్టుబడులు నిర్వహించే గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హాను నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా గాజా క్యాపిటల్ ఎంపిక చేసుకుంది.
సిమెంట్ తయారీ కంపెనీ
సిమెంట్ తయారీ కంపెనీ కనోడియా సిమెంట్ ఐపీవో ద్వారా 1.49 కోట్ల షేర్లను విక్రయించనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీకి చేరబోవు.
కొత్త కేలండర్ ఏడాదిలో ఏకధాటిగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్లు మరింత కళకళలాడనున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు 5 కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో మిల్కీ మిస్త్ డైరీ ఫుడ్, క్యూర్‌ఫుడ్స్ ఇండియా, స్టీమ్‌హౌస్ ఇండియా, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, కనోడియా సిమెంట్ చేరాయి. వివరాలు చూద్దాం..
– సాక్షి బిజినెస్ డెస్క్


