సెబీ నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్
జాబితాలో షాడోఫాక్స్ టెక్, రేజన్ సోలార్
ఏఆర్‌సీఐఎల్, సుదీప్ ఫార్మా, సేఫెక్స్ కెమ్
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు ఇటీవల దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 7 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ అనుమతించిన జాబితాలో షాడోఫాక్స్ టెక్నాలజీస్, రేజన్ సోలార్, ఏఆర్‌సీఐఎల్(ఆర్సిల్), సుదీప్ ఫార్మా, సేఫెక్స్ కెమికల్స్(ఇండియా), ఆగ్‌కాన్ ఎక్విప్‌మెంట్స్ ఇంటర్నేషనల్, పీఎన్‌జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూన్–ఆగస్ట్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు వేసిన ప్రణాళికలు అమలుకానున్నాయి. వివరాలు చూద్దాం..
లాజిస్టిక్స్ సర్వీసులు
గోప్యతా మార్గంలో లాజిస్టిక్స్ సర్వీసులందించే షాడోఫాక్స్ టెక్నాలజీస్ సెబీకి జూలైలో దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజా ఈక్విటీ జారీసహా.. ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్‌వర్క్ బిజినెస్‌పై వెచి్చంచనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రుణ పునర్వ్యవస్థీకరణ
ఆస్తుల(రుణాల) పునర్వ్యవస్థీకరణ కంపెనీ ఏఆర్‌సీఐఎల్(ఆర్సిల్) ఐపీవోలో భాగంగా 10.54 కోట్ల ఈక్వటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని పూర్తిగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఎవెన్యూ క్యాపిటల్(న్యూయార్క్) 6.87 కోట్ల షేర్లు, పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 1.94 కోట్ల షేర్లు, జీఐసీ 1.62 కోట్ల షేర్లు చొప్పున విక్రయించనున్నాయి. కంపెనీ ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి ఒత్తిడిలోపడ్డ రుణాలను సొంతం చేసుకుని పరిష్కార ప్రణాళికలను అమలు చేయడం ద్వారా రికవరీకి ప్రయతి్నంచే సంగతి తెలిసిందే.
సోలార్ సెల్ తయారీ
గుజరాత్ కంపెనీ రేజన్ సోలార్ ఐపీవోలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. నిధులలో రూ. 1,265 కోట్లు 3.5 గిగావాట్ల సోలర్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకుగాను సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీకి అందించనుంది. 2017లో ఏర్పాటైన కంపెనీ సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో దేశీయంగా టాప్–10లో ఒకటిగా నిలుస్తోంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
స్పెషాలిటీ కెమికల్స్
ఐపీవోలో భాగంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సేఫెక్స్ కెమికల్స్(ఇండియా) రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.57 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1991లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ తయారీలో ఉంది. పీఈ సంస్థ క్రిస్ క్యాపిటల్ 44.8 శాతం వాటా కలిగి ఉంది.
రెంటల్ కంపెనీ
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ అద్దెకిచ్చే ఆగ్‌కాన్ ఎక్విప్‌మెంట్స్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 94 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
పీఎన్ గాడ్గిల్ ద్వారా
ఐపీవో ద్వారా పీఎన్‌జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ నుంచి డైమండ్ జ్యువెలరీ బిజినెస్‌ను స్లంప్ సేల్ ద్వారా సొంతం చేసుకుంది. ఇలా ఏర్పాటైన కంపెనీ విడిగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ బిజినెస్ నిర్వహిస్తోంది.
కలరింగ్ ఏజెంట్స్
1989లో ఏర్పాటైన వడోదర కంపెనీ సుదీప్ ఫార్మా ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. కంపెనీ ప్రధానంగా 100 రకాలకుపైగా కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ తయారు చేస్తోంది. వీటిని ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వినియోగిస్తారు.


