
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్‌బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్‌ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్‌పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
రెండేళ్ల పాటు మెరుగైన దృష్టి
రెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.
ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.
రోజుకు రెండుసార్లు
సాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్‌బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్‌బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
కంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్‌బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.