ఎస్‌బీఐ లాభం రూ. 19,600 కోట్లు | SBI Q4 Results: Net profit drops 10 Percent to RS 18642. 5 crore | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం రూ. 19,600 కోట్లు

May 4 2025 3:29 AM | Updated on May 4 2025 8:12 AM

SBI Q4 Results: Net profit drops 10 Percent to RS 18642. 5 crore

క్యూ4లో 8 శాతం డౌన్‌ 

తగ్గిన నికర వడ్డీ మార్జిన్లు 

ఆదాయం రూ. 1,79,562 కోట్లు 

రూ. 15.90 డివిడెండు

న్యూఢిల్లీ: నికర వడ్డీ మార్జిన్లు క్షీణించిన ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సుమారు 8 శాతం క్షీణించింది. రూ. 19,600 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 21,384 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 1,64,914 కోట్ల నుంచి రూ. 1,79,562 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 32 బేసిస్‌ పాయింట్లు తగ్గి 3.15 శాతానికి పరిమితమైంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన చూస్తే లాభం వార్షికంగా రూ. 20,698 కోట్ల నుంచి  సుమారు 10 శాతం తగ్గి రూ. 18,642 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్‌లో మొత్తం ఆదాయం రూ. 1,28,412 కోట్ల నుంచి రూ. 1,43,876 కోట్లకు ఎగిసింది.  2024–25కి గాను బ్యాంకు ఒక్కో షేరుపై రూ. 15.90 మేర డివిడెండును ప్రకటించింది.  

పెట్టుబడులపై టారిఫ్‌ల అనిశ్చితి ప్రభావం.. 
‘భారత ఎకానమీపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ, సుంకాలపై అనిశ్చితి కారణంగా ఎకానమీ, అలాగే పెట్టుబడులపై మాత్రం ప్రభావం పడొచ్చు‘ అని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటంతో తదుపరి మరింతగా రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నట్లు శెట్టి వివరించారు. తమ రుణాల్లో 27 శాతం భాగం రెపో రేటుతో అనుసంధానమై ఉండటం, ఆర్‌బీఐ రేట్లను తగ్గించే అవకాశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఐఎంలపై ఒత్తిడి కొనసాగవచ్చని శెట్టి చెప్పారు. నిర్దిష్ట అంశం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం బ్యాంకు లాభం అధికంగా నమోదైందని, దానితో పోల్చి చూస్తే ప్రస్తుతం తగ్గిందని పేర్కొన్నారు. 

కొత్త ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. టారిఫ్‌ యుద్ధాల ప్రభావం రుణ వృద్ధిపై కూడా పడే అవకాశం ఉందని శెట్టి వివరించారు. వాణిజ్య విధానాల్లో మార్పులతో అంతర్జాతీయ ఎకానమీలో అనిశ్చితి నెలకొన్నందున కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికలను నెమ్మదిగా అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనితో బ్యాంకులపరంగా రుణ వృద్ధిపైనా ప్రభావం పడుతుందని శెట్టి చెప్పారు. అసెట్‌ క్వాలిటీ మరింత కాలం మెరుగ్గానే కొనసాగవచ్చన్నారు.  

18వేల కొలువులు.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ ఏకంగా 18,000 నియామకాలు చేపట్టనున్నట్లు శెట్టి తెలిపారు. దశాబ్దకాలంలోనే ఇది అత్యధికమని ఆయన పేర్కొన్నారు. ఇందులో 13,400 మంది క్లర్కులు, 3,000 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1,600 మంది స్పెషలిస్టు ఆఫీసర్లు (టెక్నాలజీ తదితర విభాగాల్లో) ఉంటారని వివరించారు.  

మరిన్ని విశేషాలు.. 
పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను  స్టాండెలోన్‌ చూస్తే ఎస్‌బీఐ నికర లాభం 16 శాతం పెరిగి రూ. 61,077 కోట్ల నుంచి రూ. 70,901 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 1,11,043 కోట్ల నుంచి రూ. 1,19,666 కోట్లకు పెరిగింది. అసెట్‌ క్వాలిటీ కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 2024 మార్చి ఆఖరు నాటికి 2.24 శాతంగా ఉండగా తాజాగా 1.82 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏలు సైతం 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గాయి.  

 2025–26లో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్విప్‌)/ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) లేదా ఇతరత్రా మార్గాల్లో ఏకమొత్తంగా లేదా విడతలవారీగా రూ. 25,000 కోట్ల వరకు మూలధనం సమకూర్చుకునే ప్రతిపాదనకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. 

 ప్రస్తుతం ఎస్‌బీఐ కార్పొరేట్‌ రుణాల పైప్‌లైన్‌ (ఇప్పటికే మంజూరైనా ఇంకా విడుదల చేయాల్సినవి, భవిష్యత్‌ అవసరాల కోసం సంప్రదింపుల దశలో జరుపుతున్నవి) రూ. 3.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. మౌలిక రంగం, రెన్యువబుల్‌ ఎనర్జీ, డేటా సెంటర్లు, కమర్షియల్‌ రియల్టీ సెగ్మెంట్ల నుంచి రుణాలకు డిమాండ్‌ నెలకొంది. మార్చి త్రైమాసికంలో కార్పొరేట్‌ రుణాల వృద్ధి 9 శాతానికి పరిమితం కాగా, రిటైల్‌ వ్యక్తిగత రుణాలు 11 శాతం పెరిగాయి. ఇందులో గృహ రుణాల వృద్ధి  14 శాతంగా ఉంది.  

 అన్‌సెక్యూర్డ్‌ పర్సనల్‌ రుణాల విభాగంలో పెద్దగా సవాళ్లేమీ లేనందున దీనిపై బ్యాంకుపై మరింతగా దృష్టి పెట్టనుంది. భారీ కార్పొరేట్‌ లోన్ల విషయంలోనూ సమస్యేమీ లేకపోవడంతో మరికొన్నాళ్ల పాటు అసెట్‌ క్వాలిటీ మెరుగ్గానే కొనసాగవచ్చు. మొండి పద్దుల నిష్పత్తి రెండు శాతం లోపే కొనసాగవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement