
కేపీఎంజీ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించడం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ బీమా పరిశ్రమలో మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించడంపై సమస్యలు ఎదురవుతున్నాయి. విశ్వసనీయత, డేటా నిర్వహణ దీనికి ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయి. కేపీఎంజీ ఇంటర్నేషనల్ రూపొందించిన ‘స్మార్ట్ ఇన్సూరెన్స్’ పరిశోధన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం, ఏఐని పూర్తిగా విశ్వసించడంపై సందేహాలు నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 46 శాతం సంస్థలు తెలిపాయి. కేవలం 25 శాతం సంస్థలు మాత్రమే దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాయి. ఇక ఏఐ వినియోగాన్ని పెంచుకోవడంలో డేటా నిర్వహణ మరో కీలక సవాలుగా ఉంటోందని 72 శాతం ఇన్సూరెన్స్ సంస్థలు వెల్లడించాయి. మరోవైపు, ఏఐపై తొందరపడి ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో ఆ పెట్టుబడులు వృధా అవుతాయేమో అనే సందేహాలు ఉన్నట్లు మూడొంతుల మంది ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
ఓవైపు కార్పొరేట్లు పర్యావరణహితమైన విధానాలతో కార్యకలాపాలు నిర్వహించుకోవడంపై దృష్టి పెడుతుండగా మరోవైపు ఏఐ కోసం భారీ ఎత్తున విద్యుత్ కూడా ఉపయోగించాల్సి వస్తుండటం సైతం కృత్రిమ మేథ విస్తృతికి ప్రతిబంధకంగా ఉంటోంది. తమ సస్టైనబిలిటీ లక్ష్యాలు, ఏఐ విద్యుత్ వినియోగానికి మధ్య సమతౌల్యం పాటించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు 72 శాతం మంది ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ఏఐ ఉపయోగపడుతోందని, తమ ప్రోడక్టులు, సరీ్వసులకు కృత్రిమ మేథ కీలకంగా ఉంటోందని 57 శాతం మంది పేర్కొన్నారు.
ఏం చేయాలంటే..
ఈ నేపథ్యంలో ఏఐని తమ ప్రస్తుత వ్యవస్థలకు అనుసంధానించడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోగలిగే సంస్కృతిని పెంపొందించుకోవడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్ (ఇన్సూరెన్స్) ఫ్రాంక్ ఫాఫెన్‌జెలర్ తెలిపారు. ప్రస్తుతం బీమా పరిశ్రమ ఇన్సూర్‌టెక్, కృత్రిమ మేథ, డిజిటైజేషన్ మొదలైన వాటన్నింటినీ సమన్వయపర్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉందని కేపీఎంజీ భారత విభాగం హెడ్ (ఇన్సూరెన్స్) కైలాస్ మిట్టల్ తెలిపారు.
దీర్ఘకాలిక లక్ష్యాలకు తగ్గట్లుగా ఏఐని వినియోగించుకోవడంపై కంపెనీలు వ్యూహాత్మకమైన మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అకౌంటింగ్ ప్రమాణాలను నిర్వచించేందుకు, రిసు్కలను ఎదుర్కొనేందుకు, గోప్యతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బీమా సంస్థలు పటిష్టమైన ఏఐ వ్యవస్థలను రూపొందించుకోవాలని పేర్కొంది. అలాగే, ముప్పులను నివారించేందుకు, అవాంఛనీయ ధోరణులను గుర్తించే క్రమంలో ఏఐ మోడల్స్‌ను నిరంతరం ఆడిట్ చేసేందుకు అధునాతన భద్రతా చర్యలు, సాధనాలను ఉపయోగించాలని సూచించింది.