breaking news
Data Management
-
బీమాలో ఏఐకి విశ్వసనీయత సవాళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించడం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ బీమా పరిశ్రమలో మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించడంపై సమస్యలు ఎదురవుతున్నాయి. విశ్వసనీయత, డేటా నిర్వహణ దీనికి ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయి. కేపీఎంజీ ఇంటర్నేషనల్ రూపొందించిన ‘స్మార్ట్ ఇన్సూరెన్స్’ పరిశోధన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఏఐని పూర్తిగా విశ్వసించడంపై సందేహాలు నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 46 శాతం సంస్థలు తెలిపాయి. కేవలం 25 శాతం సంస్థలు మాత్రమే దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాయి. ఇక ఏఐ వినియోగాన్ని పెంచుకోవడంలో డేటా నిర్వహణ మరో కీలక సవాలుగా ఉంటోందని 72 శాతం ఇన్సూరెన్స్ సంస్థలు వెల్లడించాయి. మరోవైపు, ఏఐపై తొందరపడి ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో ఆ పెట్టుబడులు వృధా అవుతాయేమో అనే సందేహాలు ఉన్నట్లు మూడొంతుల మంది ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఓవైపు కార్పొరేట్లు పర్యావరణహితమైన విధానాలతో కార్యకలాపాలు నిర్వహించుకోవడంపై దృష్టి పెడుతుండగా మరోవైపు ఏఐ కోసం భారీ ఎత్తున విద్యుత్ కూడా ఉపయోగించాల్సి వస్తుండటం సైతం కృత్రిమ మేథ విస్తృతికి ప్రతిబంధకంగా ఉంటోంది. తమ సస్టైనబిలిటీ లక్ష్యాలు, ఏఐ విద్యుత్ వినియోగానికి మధ్య సమతౌల్యం పాటించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు 72 శాతం మంది ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ఏఐ ఉపయోగపడుతోందని, తమ ప్రోడక్టులు, సరీ్వసులకు కృత్రిమ మేథ కీలకంగా ఉంటోందని 57 శాతం మంది పేర్కొన్నారు.ఏం చేయాలంటే..ఈ నేపథ్యంలో ఏఐని తమ ప్రస్తుత వ్యవస్థలకు అనుసంధానించడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోగలిగే సంస్కృతిని పెంపొందించుకోవడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్ (ఇన్సూరెన్స్) ఫ్రాంక్ ఫాఫెన్జెలర్ తెలిపారు. ప్రస్తుతం బీమా పరిశ్రమ ఇన్సూర్టెక్, కృత్రిమ మేథ, డిజిటైజేషన్ మొదలైన వాటన్నింటినీ సమన్వయపర్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉందని కేపీఎంజీ భారత విభాగం హెడ్ (ఇన్సూరెన్స్) కైలాస్ మిట్టల్ తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు తగ్గట్లుగా ఏఐని వినియోగించుకోవడంపై కంపెనీలు వ్యూహాత్మకమైన మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అకౌంటింగ్ ప్రమాణాలను నిర్వచించేందుకు, రిసు్కలను ఎదుర్కొనేందుకు, గోప్యతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బీమా సంస్థలు పటిష్టమైన ఏఐ వ్యవస్థలను రూపొందించుకోవాలని పేర్కొంది. అలాగే, ముప్పులను నివారించేందుకు, అవాంఛనీయ ధోరణులను గుర్తించే క్రమంలో ఏఐ మోడల్స్‌ను నిరంతరం ఆడిట్ చేసేందుకు అధునాతన భద్రతా చర్యలు, సాధనాలను ఉపయోగించాలని సూచించింది. -
‘సారీ.. నో డేటా’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది. డేటా నిర్వహించట్లే.. రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు. నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు. ‘రిక్రూట్మెంట్తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. -
అగ్రిడేటా.. ఆవిష్కరణల బాట
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కర ణలను ప్రోత్సహిం చేందుకు దేశంలోనే తొలి సారిగా ‘అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్’ పాలసీని రూపొందిం చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా ఉండే ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ‘విధి ఇండియా’, వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఈ పాలసీ విధివిధానాలను రూపొందిస్తోంది. కొత్త పాలసీకి సంబంధించి ముసాయిదాను వివిధ ప్రభుత్వ విభాగాలు, సంబంధిత రంగాల నిపుణుల సలహాలు, సూచనల కోసం విడుదల చేశారు. ముసాయిదాకు తుదిరూపు ఇచ్చి మరో పదిరోజుల్లో విడుదల చేసేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో వివిధ ప్రభుత్వ విభాగాల సమాచారం అత్యంత కీలకం. అయితే ఈ సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించాల్సిరావడం, సమా చారం ఇవ్వడంలో పారదర్శక విధానాలు లేకపోవడం అగ్రిటెక్ రంగానికి అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ విభాగాలు డేటాను పంచు కోవడం లో బాధ్యతతో వ్యవహరించేందుకు ‘అగ్రి కల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ’ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవ సాయం, భూ పరిపాలన, నీటిపారుదల, ప్రణాళిక విభాగాలతోపాటు జయ శంకర్ యూనివర్సిటీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (ట్రాక్) వంటి విభాగాల సమాచారం ఒకే చోట లభించేలా ఈ పాలసీ విధి విధానాలు ఉంటాయి. అగ్రిటెక్ ఆవిష్కరణలకు అవకాశాలు ఎన్నో! వ్యవసాయంలో పంటల ప్రణాళిక, వాటి రక్షణ, నీటిపారుదల, పోషకాల యాజ మాన్యం, యాంత్రీకరణ, సాగు విధానాలు, పంట నూర్పిళ్లు, పంటలబీమా, పంట రుణాలు, మార్కెటింగ్ వంటి ఎన్నో అంశాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఇటీవల నిర్వహించిన అగ్రి టెక్ సదస్సులో 83కుపైగా స్టార్టప్‌లు పాల్గొనగా, 90కి పైగా ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారా లను సూచించాయి. ఇప్పటికే కృత్రిమ మేథస్సు(ఏఐ) టెక్నాలజీ ఆధారంగా పంటల ప్రణాళిక, సాగు విధానాలు, మార్కెటింగ్‌ల్లో 30కి పైగా అగ్రిటెక్ ఆవిష్కరణలు రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయి. సమా చారం వినియోగించే వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిం చేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో రైతులు, భూముల వివరాలు, వాతావరణం, భూసారం, చీడపీడలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేలా ‘అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ’ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇదిలా ఉంటే ‘అగ్రిటెక్ డేటా మేనేజ్మెంట్ తరహాలో ఆరోగ్యం, రవాణా, స్మార్ట్‌సిటీ రంగాల్లోనూ డేటా మేనేజ్మెంట్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. -
ఇన్ఫోటెక్ లాభం రూ.69.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ ఇన్ఫోటెక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 22 శాతం, నికరలాభంలో 12 శాతం వృద్ధిని కనపర్చింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.475 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరగా, నికరలాభం రూ. 62 కోట్ల నుంచి రూ. 69 కోట్లకు చేరింది. గత నాలుగు త్రైమాసికాలుగా ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశామని, రానున్న కాలంలో కూడా ఇదే వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం నాలుగు విభాగాల పనితీరు బాగున్నప్పటికీ మూడు విభాగాలు రికార్డుస్థాయి వృద్ధిని నమోదు చేశాయన్నారు. యూరప్ బాగుంది: సమీక్షా కాలంలో యూరప్ ఆదాయంలో 10 శాతం, అమెరికా ఆదాయంలో 7 శాతం వృద్ధిని ఇన్ఫోటెక్ నమోదు చేసింది. మొత్తం మీద ఆదాయంలో చూస్తే ఆమెరికా వాటా తగ్గి యూరప్ వాటా పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 61 శాతం నుంచి 57 శాతానికి తగ్గితే, యూరప్ వాటా 25 నుంచి 29 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 11 మంది కస్టమర్లు వచ్చి చేరగా, 801 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం వదిలివెళ్ళిన వారిని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 319 మందిని తీసుకున్నట్లు చెప్పారు. మార్కెట్ అంచనాలను మించి ఫలితాలను ఇవ్వడంతో గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫోటెక్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం పెరిగి రూ.347 వద్ద ముగిసింది.