ప్రీమియం బైక్‌లకు డిమాండ్‌ | Rising Demand for Premium Bikes: Ravinder Singh | Sakshi
Sakshi News home page

ప్రీమియం బైక్‌లకు డిమాండ్‌

Mar 25 2026 4:31 AM | Updated on Mar 25 2026 4:31 AM

Rising Demand for Premium Bikes: Ravinder Singh

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో బ్లూ స్క్వేర్‌ డీలర్‌షిప్‌ల విస్తరణ 

ఎలక్ట్రిక్‌ వాహనాలతో దీర్ఘకాలిక అవకాశాలు 

యమహా మోటర్‌ ఇండియా ఎస్‌వీపీ రవీందర్‌ సింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా ప్రీమియం మోటర్‌సైకిల్స్‌కి ఆదరణ పెరుగుతోందని యమహా మోటర్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఆర్‌15, ఎంటీ–15, ఎఫ్‌జెడ్‌ మోటర్‌ సైకిల్స్, ఏరాక్స్‌ 155, 125 సీసీ, ఫాసినాలాంటి స్కూటర్లకు మంచి డిమాండ్‌ ఉందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో ప్రీమియం వైపు మళ్లుతున్న ధోరణి కనిపిస్తోందని ఆయన చెప్పారు. తమ దక్షిణాది మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 13 శాతం వాటాతో కీలకంగా ఉంటున్నాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి తెలిపారు.

రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 ప్రీమియం బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లతో పాటు మొత్తం 115 పైగా టచ్‌ పాయింట్లు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బ్లూ స్క్వేర్‌ డీలర్‌షిప్‌లను ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు ఇతరత్రా కొత్త మార్కెట్లలోను మరింతగా విస్తరించనున్నట్లు సింగ్‌ వివరించారు. పండుగల సందర్భంగా ఆర్‌15, ఫాసినో తదితర మోడల్స్‌పై ఆకర్షణనీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  

ఫీచర్స్, పనితీరుకు యూత్‌ ప్రాధాన్యం.. 
హైదరాబాద్‌లాంటి అర్బన్‌ మార్కెట్లలో యువత ప్రధానంగా పనితీరు, స్టయిల్‌తో పాటు అధునాతన ఫీచర్స్‌ ఉన్న ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని సింగ్‌ చెప్పారు. కొనుగోళ్ల విషయంలో సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు, ఆన్‌లైన్‌ రివ్యూలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్, రైడింగ్‌ కమ్యూనిటీల అభిప్రాయాల ప్రభావం ఉంటోందన్నారు. 2018లోనే ప్రీమియం వాహనాలకు డిమాండ్‌ని అంచనా వేసి వివిధ మోడల్స్‌ తెచ్చామన్నారు. దీనితో 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో 11% మార్కెట్‌ వాటా దక్కించుకున్నామని సింగ్‌ చెప్పారు.  

సానుకూలంగా అవుట్‌లుక్‌.. 
ఆదాయాలు పెరుగుతుండటం, పట్టణ–సెమీ అర్బన్‌ మార్కెట్లలో వాహనాలకు డిమాండ్‌ మొదలైనవి టూ–వీలర్ల పరి శ్రమకు సానుకూలాంశాలమని సింగ్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్‌ కనెక్టివిటీ, అధునాతన భద్రతా ఫీచర్లు, డిజైన్‌ వంటివి కొనుగోలు ప్రణాళికలను ప్రభావితం చేస్తాయన్నారు. కొత్త సాంకేతికతల వినియోగం, ఎగుమతి అవకాశాలు మొదలైన అంశాల దన్నుతో పరిశ్రమ సానుకూల వృద్ధిని సాధించవచ్చని తెలిపారు.

ఎలక్ట్రిక్‌పై ఫోకస్‌.. 
పర్యావరణహితమైన, చౌకైన మొబిలిటీ సొల్యూషన్స్‌ వైపు పట్టణ ప్రాంతాల్లోని వారు మొగ్గు చూపుతున్నందున ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని సింగ్‌ తెలిపారు. దీన్ని తాము స్వల్పకాలిక మార్పు కాకుండా దీర్ఘకాలిక అవకాశంగా పరిగణిస్తున్నామని,  ఈ విభాగాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన ఉత్పత్తులను ఆవిష్కరించే వ్యూహంలో భాగంగా ఈసీ–06, ఏరాక్స్‌–ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణమైన ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత వాహనాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement