పెంపుడు జంతుల మీద ప్రేమ చూపించేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు మొదలైనవాటి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో 'డాగ్ నానీ'లకు డిమాండ్ ఎక్కువైంది. ధనిక కుటుంబాలు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసుకునే ప్రొఫెషనల్ కేర్‌టేకర్లను నియమించుకుంటున్నారు. అధికమొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నారు.
అమెరికాలో ఫుల్‌టైమ్ డాగ్ నానీలు వారానికి 2,500 డాలర్లకుపైగా, అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.2.4 లక్షలు వరకు సంపాదిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపారు. దీంతో వాటిపై అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమవుతోంది.
డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం వంటి బాధ్యతలూ ఉంటాయి. కొందరు నానీలు యజమానులు ఇళ్లలోనే ఉంటారు. వారికి వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు కూడా యజమానులే భరిస్తున్నారు.
కుక్కలను సంరక్షించడంలో అనుభవం ఉన్నవారు గంటకు 40 నుంచి 50 డాలర్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రోజుకు 500 నుంచి 800 డాలర్ల వరకు సంపాదించుకుంటున్నట్లు సమాచారం. గతంలో బ్రిటన్‌లో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి లక్ష పౌండ్ల (రూ. కోటి కంటే ఏక్కువ) జీతంతో డాగ్ నానీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి వార్తల్లో నిలిచింది.
పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించిన లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన లేదా సర్టిఫికేషన్ ఉన్న కేర్‌టేకర్లు మరింత ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.
ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!


