
మళ్లీ మార్కెట్ క్యాప్ రికార్డ్‌స్థాయికి..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువ మరోసారి రూ. 20 లక్షల కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. షేరు ధర తాజాగా 2 శాతం పుంజుకుని రూ. 1,495కు చేరడంతో బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,838 కోట్లు బలపడింది. వెరసి బ్లూచిప్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20,23,375 కోట్లను అధిగమించింది. ప్రధాన ఇండెక్సులలో అధిక వెయిటేజీ గల కంపెనీ షేరు లాభపడటంతో మార్కెట్లకు సైతం జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఇంతక్రితం గతేడాది(2024) ఫిబ్రవరి 13న రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి దేశీ దిగ్గజంగా రిలయన్స్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఐఎల్ తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ. 15,51,219 కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని పొందింది. ఈ బాటలో మార్కెట్ విలువ ద్వారా ఇతర బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్(రూ. 12,45,219 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ. 12,45,219 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 10,27,839 కోట్లు) తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది ఆర్‌ఐఎల్ షేరు ఇప్పటివరకూ 23 శాతం జంప్‌చేయడం విశేషం!