క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ రక్షణ

RBI Protects Crypto Investors - Sakshi

కరెన్సీ పతనమైనా కొంత సురక్షితంగా దేశీ మదుపుదారులు

కాపాడిన రిజర్వ్‌ బ్యాంక్, కేంద్రం విధానాలు

విశ్లేషకుల అభిప్రాయం

న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్‌ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్‌ డాలర్‌ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది.

ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్‌టీఎక్స్‌ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌–ఫ్రైడ్‌ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది.  

ఆర్‌బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి..
అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్‌బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు.

క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్‌ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్‌బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్‌ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా.

ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్‌ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్‌ ప్లాట్‌ఫాం సెన్సిబుల్‌డాట్‌కామ్‌ సీఈవో ఆబిద్‌ హసన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్‌బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్సే్చంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎన్‌ఎంఐ) ప్రెసిడెంట్‌ కమ్లేష్‌ షా అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top