
క్విక్‌కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. క్విక్‌కామర్స్ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్ అలవాట్లను రెడ్‌సీర్ నివేదిక ప్రస్తావించింది.
2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్ కామర్స్ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్‌స్టోర్‌కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్15కు తదుపరి టాప్ 20 పట్టణాల్లో డార్క్ స్టోర్ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.
ఇది డిమాండ్ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్‌కామర్స్ సంస్థలు ఆఫర్ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.
దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్ మెట్రోల్లో ఒక్కో డార్క్‌స్టోర్ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.