
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 1,400 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: పవర్ సొల్యూషన్లు అందించే పవరికా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
ప్రమోటర్లలో నరేష్ ఒబెరాయ్ కుటుంబ ట్రస్ట్ రూ. 490 కోట్లు, కబీర్, కిమయా ఫ్యామిలీ ప్రయివేట్ ట్రస్ట్ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కాగా.. కంపెనీ ఇంతక్రితం 2019లోనూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఐపీవో చేపట్టకపోవడం గమనార్హం! కంపెనీ ప్రధానంగా డీజిల్ జనరేటర్(డీజీ) సెట్లు, మధ్యస్థాయి స్పీడ్ భారీ జనరేటర్లు(ఎంఎస్‌ఎల్‌జీ), తత్సంబంధ సరీ్వసులను అందిస్తోంది.